- గర్భంలో శిశువును చంపొద్దని ఓ తల్లికి హితబోధ
- సపర్యలు చేసి బిడ్డ పుట్టాక దత్తత తీసుకున్న ట్రాన్స్జెండర్
- పోలీసులకు ఫిర్యాదు చేసిన గిట్టనివారు
- బాబును సఖి సెంటర్కు తరలించిన అధికారులు
- తనకు అప్పగించాలని పోరాటం
జగిత్యాల, వెలుగు : ఆమె ఓ ట్రాన్స్జెండర్.. బిడ్డను నవ మాసాలు మోసి కనే అవకాశం లేకపోవడంతో ఎవరినైనా పెంచుకోవాలని ఆశ పడింది. శిశువును పురిట్లోనే చంపాలనుకున్న ఓ తల్లిని వారించి... చేరదీసింది. పాప అయినా..బాబు అయినా తానే చూసుకుంటానని భరోసా ఇచ్చింది. పురుడు పోసేంతవరకు దగ్గరుండి సపర్యలు చేసింది. ఖర్చంతా పెట్టుకుంది. తల్లి ఇష్టప్రకారమే బాబును తీసుకుంటున్నానని పేపర్ రాయించుకుని బిడ్డను తీసుకువెళ్లింది. కానీ, కొంతమంది ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అధికారులు పిల్లవాడిని సఖి సెంటర్కు తరలించారు. దీంతో తన బిడ్డను తన దగ్గరకు చేర్చి న్యాయం చేయాలని వేడుకుంటోంది .
బిడ్డను చంపొద్దని...
జగిత్యాల జిల్లా టీఆర్ నగర్ లో ఉండే ట్రాన్స్ జెండర్ నూనె సారిక మూడేండ్ల కింద వాజిద్ ను పెండ్లి చేసుకుంది. పిల్లలంటే ఇష్టమున్న సారిక దత్తత తీసుకోవాలని చూస్తోంది. సారిక స్నేహితురాలొకరు గర్భం దాల్చగా భర్త వదిలి వెళ్లి పోవడంతో అబార్షన్ చేయించుకోవడానికి సిద్ధమైంది. సారికను కలిసి విషయం చెప్పగా చంపడం అనే ఆలోచన తప్పని, తనకు ఇస్తే పెంచుకుంటానని చెప్పింది. ఆరు నెలల కింద ఆమె బాబుకు జన్మనివ్వగా పిల్లవాడిని తనతో తీసుకువెళ్లింది.
ఘనంగా పురుడు ఫంక్షన్ ..
బాబు పుట్టినప్పటి నుంచి సారిక కంటికి రెప్పలా కాపాడుకుంటోంది. వారం రోజుల వయస్సున్నప్పటి నుంచి ఇప్పటివరకు ఏలోటు లేకుండా పెంచింది. షాపుల్లో అడుక్కోగా వచ్చిన డబ్బులను బాబు కోసమే ఖర్చు పెట్టేది. 21 రోజులకు ఘనంగా పురుడు ఫంక్షన్ సుశాంత్ అని పేరు పెట్టుకుంది. ప్రతిరోజూ తల్లీబిడ్డల అనుబంధం మీద వచ్చే పాటలతో వీడియోలు చేసి ఇన్స్టాగ్రామ్లో పెట్టి సంబురపడేది. దీంతో తమ బిడ్డ బతుక్కు ఓ అర్థం వచ్చిందని సారిక అమ్మానాన్నలు కూడా సంతోషపడ్డారు. కానీ ఆ ఆనందం ఎంతో సేపు నిలవలేదు. సారిక బాబును సరిగ్గా చూసుకోవడం లేదని కొందరు నెల కింద పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారు విమెన్ అండ్ చైల్డ్ డిపార్ట్మెంట్అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో అధికారులు వచ్చి పిల్లాడిని సఖి కేంద్రానికి తరలించారు. ఆ సమయంలో సారిక అధికారుల కాళ్లపై పడి వేడుకుంది. బాబును తన నుంచి దూరం చేయవద్దని, తాను కనకపోయినా తల్లి కంటే ఎక్కువగానే చూసుకున్నానని వేడుకుంది. అయినా తాము ఏమీ చేయలేమని, రూల్స్ ప్రకారం తప్పదంటూ బాబును తీసుకువెళ్లిపోయారు.
బాబును కోసం రోజూ ఆఫీసుకు..
ఊహించని ఘటనతో షాక్ తిన్న సారిక బాబును తనకు అప్పగించాలని ప్రతి రోజూ కలెక్టరేట్ దగ్గరున్న సఖి ఆఫీసుకు వచ్చి పోతోంది. బాబును చూపించకపోవడంతో సాయంత్రం వరకు అక్కడే ఉంటోంది. ఈమె బాధను అర్థం చేసుకున్న కొందరు సిబ్బంది ఒకరోజు వీడియో కాల్లో బాబును చూపించగా కన్నీరుమున్నీరైంది. ఒక్కసారి ప్రత్యక్షంగా బాబును చూపించాలని వేడుకుంటోంది. న్యాయం అంటూ ఉంటే బాబు తన దగ్గరకు వస్తాడని, అప్పటివరకు పోరాటం చేస్తానని చెప్తోంది.