ఎస్సై ఈవెంట్స్​లో సత్తా చాటిన తల్లీకూతుళ్లు

నేలకొండపల్లి, వెలుగు: ఎస్సై ఈవెంట్స్​లో తల్లీకూతుళ్లు సత్తా చాటారు. పరుగు పందెం, లాంగ్ జంప్, షాట్ ఫుట్ విభాగాలలో పోటీ పడి ఇద్దరూ అర్హత సాధించారు. ఖమ్మం రూరల్ మండలం రామన్నపేట గ్రామంలో నిరుపేద దళిత కుటుంబంలో పుట్టిన నాగమణి చిన్నప్పటి నుంచే ఇటు చదువులోనూ, అటు క్రీడల్లోనూ రాణించేది. స్కూల్, కాలేజీ క్రీడల్లో రాష్ట్రస్థాయి అవార్డులు ఎన్నో అందుకుంది. ఆర్థిక పరిస్థితులు, పైగా ఆడపిల్ల కావడంతో తండ్రి పెళ్లి చేసి అత్తారింటికి పంపించారు. అయినా నాగమణిలో మాత్రం ఏదో సాధించాలన్న తపన. ఆ కసితోనే అంగన్ వాడీ ఉద్యోగం సాధించింది. పోలీసు కావాలనే తన చిన్నప్పటి కోరిక మేరకు హోంగార్డు ఉద్యోగం సాధించింది. ఆ తర్వాత  సివిల్ కానిస్టేబుల్ ఉద్యోగం ఇలా అంచెలంచెలుగా తన పట్టుదలతో ఎదిగింది. ప్రస్తుతం ములుగు జిల్లాలో కానిస్టేబుల్​గా చేస్తోంది. అయినా సంతృప్తి చెందని నాగమణి ఈ ఏడాది వచ్చిన ఎస్సై నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసింది. కూతురు త్రిలోకినితో కూడా దరఖాస్తు చేయించింది. ప్రిలిమ్స్ లో తల్లీకూతురు అర్హత సాధించారు. నాగమణి తనకున్న అవగాహనతో గ్రౌండ్‭కు కూతురును తీసికెళ్లి మెళకువలు నేర్పింది. ఇద్దరూ కలిసి ప్రాక్టీస్​చేశారు. తల్లీకూతుళ్లకి ఒకేరోజు ఈవెంట్స్ కావడం, మళ్లీ ఒకే బ్యాచ్ రావడంతో పోటీపడి మరీ అర్హత సాధించారు.  

హైట్​ కోసం తలపై మైనం.. ఎస్సై ఈవెంట్స్​లో ఒకరి డిస్​క్వాలిఫై

మహబూబ్ నగర్ టౌన్, వెలుగు: ఎత్తు ఎక్కువగా కనిపించేందుకు తలపై మైనం పెట్టుకుని ఎస్సై ఈవెంట్స్​కు హాజరైన అభ్యర్థిని ఎస్పీ డిస్​క్వాలిఫై చేశారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో బుధవారం ఎస్సై ఉద్యోగాలకు సంబంధించిన ఈవెంట్స్ నిర్వహించారు. ఈవెంట్స్ లో భాగంగా ఎలక్ట్రానిక్ మెషిన్​తో అందరి ఎత్తు కొలుస్తున్నారు. ఓ అభ్యర్థిని ఎలక్ట్రానిక్ మెషిన్​పై నిలబడినప్పటికీ సెన్సర్ స్పందించలేదు. దీంతో మహిళా ఆఫీసర్ అభ్యర్థి తలపై పరిశీలించగా, జుట్టులో మైనం అతికించుకున్నట్లుగా తేలింది. తలపై ఉబ్బెత్తుగా మైనం పెట్టుకుని తన ఎత్తు ఎక్కువ చూపేందుకు ప్రయత్నం చేసిన ఆమెను ఎస్పీ డిస్ క్వాలిఫై చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఎంపిక ప్రక్రియలో ఆధునిక టెక్నాలజీతో పాటుగా సీసీ కెమెరాలు, పోలీస్ ఆఫీసర్ల నిశిత పరిశీలన ఉంటుందన్నారు. ఎటువంటి అవకతకవలకు పాల్పడినా చర్యలు తప్పవని హెచ్చరించారు.