మహారాష్ట్రలో అప్పుడూ ఇప్పుడూ… అమ్మే

అమ్మ సెంటిమెంట్​ అనగానే తమిళ సినిమాలు గుర్తొస్తాయి. అంతకంటే మించిన సెంటిమెంట్​ మరాఠీ తల్లులది. వాళ్ల తపన, తాపత్రయం పిల్లల ఎదుగుదలకోసమే! చరిత్రను ఓ నాలుగొందల ఏళ్ల వెనకనుంచి చూస్తే…  ఎన్నో ఉదాహరణలు దొరు కుతాయి. మరాఠా చరిత్రలో జీజా బాయి మొదలుకొని రష్మి థాక్రే వరకు  స్ట్రేటజికల్​ సెంటిమెంట్​తో పాలిటిక్స్​ని నడిపించారు. అందరూ సక్సెస్​ కాకపోయి ఉండొచ్చు కానీ, చరిత్రలో చెరగని ముద్ర వేసినవాళ్లే ఎక్కువ.

జీజాబాయి

శివాజీ తల్లిగా, అతనిని మహావీరుడిగా తీర్చిదిద్దిన మహిళగా జీజాబాయి చరిత్రకెక్కారు. భర్త షాహాజీ భోస్లే బీజాపూర్, మొఘల్​ సుల్తాన్​ల సేవలో ఉన్నప్పుడు మరో ఇద్దరిని పెళ్లాడాడు. దాంతో, శివాజీ చిన్నతనంలోనే జీజాబాయి తమ జాగీరైన పుణేకి వచ్చేసింది. అక్కడే శివాజీని పెంచి పెద్ద చేసి మరాఠా రాజ్య స్థాపకుడిగా తయారు చేసింది. మహారాష్ట్రలోనే కాదు, మొత్తం దేశంలోనే ఆదర్శవంతమైన తల్లిగా జీజాబాయికి గుర్తింపు ఉంది.

సాయిబాయి నింబాల్కర్

ఛత్రపతి శివాజీకి పెద్ద భార్య సాయి బాయి నింబాల్కర్​. శివాజీకి యుద్ధ వ్యూహాల్లోనూ, పాలనా వ్యవహారాల్లోనూ  సాయిబాయి బాగా సహకరించేది. సాయిబాయి కొడుకు శంభాజీనే శివాజీ వారసుడయ్యాడు.

సోయరాబాయి మొహితే

శివాజీ అయిదుగురు భార్యల్లో ఈమె రెండోది. శివాజీ పెద్ద కొడుకు శంభాజీకి కాకుండా తన కొడుకు రాజారామ్​కి సింహాసనం దక్కాలన్న కోరిక బాగా ఉండేది. రాజ్యం కోసం జరిగిన కుట్రల్లో శివాజీ అనుచరులు శంభాజీ వైపు ఉండడంతో సాధ్యం కాలేదు. దీంతో ఔరంగజేబు నాలుగో కొడుకు అక్బర్​తో కుట్ర చేసింది. 1689లో శంభాజీని మొఘల్​ రాజులు పట్టుకుని, నానా హింసలు పెట్టి, చంపేశారు. సోయరాబాయి తన కొడుకు రాజారామ్​కి పట్టం కట్టింది.

మీనా థాక్రే

శివసేన ఫౌండర్​ బాల్​ థాక్రే, ఆయన అన్న శ్రీకాంత్​ థాక్రేలు అక్కచెల్లెళ్లయిన కుంద, మీనాలను పెళ్లాడారు. శ్రీకాంత్​–కుంద థాక్రేల కొడుకు రాజ్​ థాక్రే. శివసేనలో ఒకప్పుడు బాలాసాహెబ్​ తర్వాత రాజ్​ థాక్రే పేరే వినపడేది. అయితే, పొలిటికల్​ హైరార్కీ తన కొడుక్కే దక్కాలని బాల్​ థాక్రేపై మీనా ఒత్తిడి తెచ్చి పట్టుబట్టి ఉద్ధవ్​ థాక్రేని వర్కింగ్​ ప్రెసిడెంట్​గా చేశారని చెబుతారు. సొంత సోదరి కొడుకైన రాజ్​ థాక్రే పార్టీ నుంచి బయటకు వెళ్లిపోయేలా పొగపెట్టింది కూడా మీనానే అని ఎనలిస్టులు అంటారు.

ప్రతిభా పవార్

రెండు రోజుల నుంచి గట్టిగా మీడియాలో వినిపిస్తున్న పేరు ప్రతిభా పవార్​. ఈమె శరద్​ పవార్​ భార్య. కుటుంబం నుంచి విడిపోయి బీజేపీతో చేతులు కలిపిన అజిత్​ పవార్​ని వెనక్కి తీసుకురావడంలో ప్రతిభ చాలా చాకచక్యంగా, చురుగ్గా వ్యవహరించారు.

సుప్రియ సూలె

శరద్​ పవార్​ కూతురు సుప్రియ సూలె మైక్రోబయాలజీ చదివారు.  తన మేనల్లుడు (శరద్​ పవార్​ అన్న అప్పాసాహెబ్​ మనవడు) రోహిత్​ పవార్​ని ఎంకరేజ్​ చేస్తున్నారు. దీంతో అజిత్​ ​ అలిగి బీజేపీకి వెళ్లారని చెబుతారు.

రష్మి థాక్రే

మహారాష్ట్రకి కాబోయే ముఖ్యమంత్రి ఉద్ధవ్​ థాక్రే భార్య రష్మి. కింగ్​మేకర్లుగా ఉండే థాక్రేలను డైరెక్ట్​ పాలిటిక్స్​లోకి దింపిన ఘనత ఈమెదే. తన కొడుకు ఆదిత్య థాక్రేని సీఎంగా చూడాలన్నది రష్మి కోరిక. అందుకు బీజేపీ ససేమిరా అనడంతో 30 ఏళ్లపాటు కొనసాగిన స్నేహాన్ని శివసేన వదులుకుంది. కాంగ్రెస్​, ఎన్సీపీలుకూడా ఈ చిన్న కుర్రాడిని సీఎంగా చేయడానికి అంగీకరించకపోయేసరికి, తప్పనిసరై ఉద్ధవ్​ సీఎం అవుతున్నారు.