రాష్ట్రంలోని నిరుద్యుగుల డిమాండ్ల కోసం గాంధీ ఆస్పత్రిలో గత తొమ్మిది రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న మోతిలాల్ నాయక్ తన దీక్షను విరమించారు. కొబ్బరినీళ్లు తాగి దీక్షను విరమించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నిరుద్యుగుల డిమాండ్ల కోసం గత తొమ్మిది రోజులుగా దీక్ష చేస్తున్నానని.. తొమ్మిది రోజుల దీక్షలో ఒక్క ఉద్యోగం కూడా పెరగలేదన్నారు. ఇన్ని రోజులు అన్న పానియాలు లేకుండా ఆమరణ దీక్ష చేశానన్నారు మోతిలాల్. తన ఆరోగ్యం సరిగ్గా లేదని.. క్రియాటిన్ లేవల్స్ పెరిగి.. కిడ్నీ, లివర్లు పాడయ్యే పరిస్థితికి వచ్చిందని చెప్పుకొచ్చారు.
ఇతర రాష్ట్రల పెత్తనం పోయిన మన బతుకు మారలేదని మోతిలాల్ ఆవేదన వ్యక్తం చేశారు. 25 నుంచి 35 సంవత్సరాల వయసు యువత ఉద్యోగాల కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారన్నారు. కొత్త ప్రభుత్వం రాగానే... తమ డిమాండ్లు పరిష్కరిస్తామని చెప్పారని కానీ ఆ దిశగా అడుగులు మాత్రం పడలేదని మండిపడ్డారు. రేపటి నుంచి ఉద్యోగాల కోసం తీవ్ర పోరాటం చేస్తామని చెప్పిప మోతిలాల్.. 50 వేల ఉద్యోగాలు ఇచ్చే వరకు ఉద్యమాన్ని తీవ్రం చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం జీవోలను రిలీజ్ చేసే వరకు ఉద్యమిస్తామని తెలిపారు. తనకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదములు..
నిరుద్యోగుల డిమాండ్లు ఇవే
* గ్రూప్-1 మెయిన్స్ ఎలిజిబిలిటీ 1:100కు పెంచాలి.
* గ్రూప్-2లో 2000, గ్రూప్-3లో 3000 ఉద్యోగాలు కలపాలి.
* జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి
* 25వేల పోస్టులతో మెగా డీఎస్సీ ప్రకటించాలి.
* గురుకుల ఉపాధ్యాయ పోస్టులను బ్యాక్‌లాగ్‌లో ఉంచకూడదు
* నిరుద్యోగులకు రూ.4 వేలు భృతి, 7 నెలల బకాయిలు ఇవ్వాలి.