
కుంటాల, వెలుగు: కుంటాల సహకార సంఘం అధ్యక్షుడు సట్ల గజ్జరాంపై డైరెక్టర్లు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. మంగళవారం సొసైటీ కార్యాలయంలో అధికారులు అవిశ్వాస తీర్మానానికి ఏర్పాట్లు చేయగా డైరెక్టర్లు గైర్హాజరయ్యారు. గడువు ముగియడంతో చైర్మన్ సట్ల గజ్జరాంపై అవిశ్వాస తీర్మానం వీగిపోయినట్లు డీసీఓ నర్సయ్య తెలిపారు. దీంతో వారం రోజులుగా కొనసాగుతున్న హైడ్రామాకు ఎట్టకేలకు తెరపడింది.
ఫలించిన మాజీ ఎమ్మెల్యే బుజ్జగింపులు
సట్ల గజ్జరాంపై సొంత పార్టీ డైరెక్టర్లు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడంతో కుంటాల మండల బీఆర్‌ఎస్‌లో అలజడి రేగింది. మండల సీనియర్ నాయకులు డైరెక్టర్లతో చర్చించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, ముథోల్ మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి రంగంలోకి దిగారు. తిరుగుబాటుకు నాయకత్వం వహిస్తున్న డైరెక్టర్లు గోనె గజ్జరాం, తూర్పాటి వెంకటేశ్‌లతో మాట్లాడారు. క్లిష్ట పరిస్థితిలో పార్టీ డ్యామేజ్ కాకుండా చూడాలని, అన్ని సర్దుకుంటాయని నచ్చజెప్పారు. దీంతో క్యాంపులో ఉన్న డైరెక్టర్లు, చైర్మన్ గజ్జరాం, మండల బీఆర్‌ఎస్ నాయకులు బైంసాలో విఠల్ రెడ్డి సమక్షంలో రాజీపడ్డట్లు తెలిసింది.