ప్రొఫెసర్ జయశంకర్ మన నుంచి దూరమై11 ఏండ్లు గడిచినా, ఆయన ఆలోచనలు ఇప్పటికీ మన మధ్య సజీవంగానే ఉన్నాయి. ఇయ్యాల ఆయన వర్ధంతి సందర్భంగా సార్ గురించి రెండు విషయాలను గుర్తు చేసుకోవాలి. అందులో మొదటిది ఆయన అధ్యయన పద్ధతి. జయశంకర్ సార్ చదవకుండా, పరిశీలించకుండా ఏ విషయంపైనా మాట్లాడేవారు కాదు. ఎవరు చెప్పినా, ఎంతటి పెద్దవాళ్లు చెప్పినా వెంటనే నమ్మే వారు కాదు. ఫలానా వాళ్లు చెప్పగా విన్నానని మాత్రమే అనే వారు. నేను అధ్యయనం చేయలేదని ఇబ్బంది పడకుండా సూటిగానే చెప్పేవారు. పుస్తకాలు చదివి, అనుభవాలను పరిశీలించి, అధికారిక గణాంకాలు చూశాకే తన అభిప్రాయాన్ని వివరించడం వారు అలవరచుకున్న పద్ధతి. ఒక్కోసారి ఏదైనా విషయంపైన వారి అభిప్రాయాన్ని అడిగితే, నిర్మొహమాటంగా నేను ఆ విషయంపై చదవ లేదు. ఇప్పుడే మాట్లాడలేనని చెప్పేవారు. హైదరాబాదును కేంద్ర పాలిత ప్రాంతం చేయాలని ఆంధ్రా పాలకులు డిమాండ్ చేసినప్పుడు తెలంగాణ వైపు నుంచి రావాల్సిన ప్రతిస్పందన గురించి వారిని అడిగాను. నేను అధ్యయనం చేయలేదు అన్నారు. తరువాత లోతుగానే అధ్యయనం చేసి హైదరాబాద్ విషయమై తెలంగాణ ప్రజలకు కావాల్సినంత సమాచారం అందించారు.
చంద్రబాబుతో సంవాదం
ఓసారి పౌర స్పందన వేదిక తరఫున ఎస్ఆర్శంకరన్ నేతృత్వంలో కన్నబిరాన్, తారకం, పొత్తూరి వేంకటేశ్వర రావు, హరగోపాల్ తదితరులు, మార్క్సిస్టు- లెనినిస్టు అవగాహన వెలుగులో నడుస్తున్న రైతాంగ ఉద్యమం పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న అణచివేత వైఖరిని ఆపాలని అడగటానికి అప్పటి సీఎం చంద్రబాబును కలిశారు. ఆ సమావేశంలో జయశంకర్ సామాజిక, రాజకీయ ఉద్యమాలను శాంతి భద్రతల సమస్యగా చూడరాదని చంద్రబాబుతో అన్నారు. ఆ దృక్పథాన్ని వదిలి, ఉద్యమాలు తలెత్తడానికి గల మూలకారణాలను వెతికి, వాటిని పరిష్కరించడానికి ప్రయత్నించాలని కోరారు. సాగునీటి వసతి లేక తెలంగాణలో సుమారు 40 శాతం భూమి పడావ్ ఉందన్న విషయాన్ని ప్రస్తావించారు. సార్ వాదనను సీఎం కొట్టిపారేయ లేదు. ఆయన చెప్పిన అంశంపై లోతుగానే పరిశీలించాల్సిన అవసరమున్నదని అన్నారు. వెంటనే అక్కడ ఉన్న ఓ పోలీసు అధికారి జయశంకర్ సార్ చెప్పిన విషయాన్ని తిరస్కరించారు. గణాంకాలు ప్రభుత్వం ఇచ్చినవేనని సార్ సమాధానం చెప్పారు. ఆ అధికారి వాస్తవాలను చూడటానికి నిరాకరిస్తూ.. గణాంకాలను ఏ విధంగానైనా మలుచుకోవచ్చని అసహనంతో బదులు చెప్పారు. సీఎం కూడా ఆయన మాటే విన్నారు. అప్పుడు నేను ప్రభుత్వ లెక్కలను మరోసారి పరిశీలించి ఉత్తరం రాస్తానని సార్ అన్నారు. అక్కడితో ఆయన ఆగిపోలేదు. వరంగల్ వెళ్లాక తన దగ్గర ఉన్న ప్రభుత్వ గణాంకాలను పరిశీలించారు. తాను చెప్పింది వాస్తవమేనని తేలింది. వెంటనే సీఎంకు ఉత్తరం రాశారు. తాను పరిశీలించిన ప్రభుత్వ నివేదికల పేర్లు, అందులో ఉన్న గణాంకాలను పేజీ నంబర్లతో సహా పేర్కొన్నారు. అధికారిక లెక్కలు అబద్ధమైతే రాష్ట్ర భవిష్యత్తును భగవంతుడు కూడా కాపాడలేడని కూడా అన్నారు.
విద్యావంతుల పాత్ర
సార్ నుంచి నేర్చుకోవాల్సిన రెండో విషయం ఇంకోటి ఉంది. విద్యావంతులకు సమాజం పట్ల బాధ్యత ఉందని ఆయన బలంగా నమ్మినవారు. సమాజం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు విద్యావంతులు మౌనంగా ఉండటం టెర్రరిజం కన్నా పెద్ద నేరమని భావించేవారు. సామాజిక సమస్యలు తలెత్తడానికి గల కారణాలను వెలికి తీసి, వాటి పరిష్కారానికి మార్గాలను సూచించి ప్రజలకు తోడ్పడాలని వారు ప్రవచించారు. ఈ ఆలోచనతోనే వారు తెలంగాణ సాధన కోసం కృషి చేశారు. భావవ్యాప్తి ద్వారా తాను జీవితాంతం తెలంగాణ సాధన కోసం పోరాడారు. ఎక్కడా రాజీ పడలేదు. నేటి విద్యావంతులు సార్ జీవితం నుంచి నేర్చుకోవాల్సింది ఇదే. పాలకులు నిరంకుశంగా ప్రభుత్వాన్ని స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకుంటున్న ఈ తరుణంలో విద్యావంతుల పాత్ర చాలా కీలకమైనది.