ఎమ్మెల్యేగా పోటీ చేస్తా.. నేను సన్యాసిని కాదు

మాజీ మంత్రి, ఆలేరు మాజీ ఎమ్మెల్యే , బీఆర్ఎస్ నేత మోత్కుపల్లి నర్సింలు మరోసారి హాట్ కామెంట్స్ చేశారు.  వచ్చే ఎన్నికల్లో తాను ఖచ్చితంగా ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని ప్రకటించారు. రెండు రోజుల క్రితం తన పుట్టిన రోజు సందర్భంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎక్కడి నుంచైనా ఎమ్మెల్యేగా పోటీకి సిద్ధమని ప్రకటించిన మోత్కుపల్లి..తాజాగా మరోసారి ఆ వ్యాఖ్యలే చేశారు. తాను ఎక్కడి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలనేది సీఎం కేసీఆర్ నిర్ణయిస్తారని చెప్పారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవంలో మోత్కుపల్లి  ఈ కామెంట్స్ చేశారు. 
 
 ఆలేరు నియోజకవర్గం నుండి తాను 6 సార్లు ఎమ్మెల్యే గా గెలిచానని మోత్కుపల్లి నర్సింలు తెలిపారు. గతంలో  ఏ పార్టీ కూడా ఎమ్మెల్యేగా అవకాశం ఇవ్వకపోతే ఇండిపెండెంట్ గా గెలిచానని గుర్తు చేశారు. కాబట్టి వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని..పోటీలో ఉండకపోవడానికి తాను సన్యాసిని కాదన్నారు.  ప్రజల కోసం పనిచేసిన వ్యక్తిని  ఇంట్లో  కూర్చోవాలంటే కాళ్లు ఆగటం లేదన్నారు.  ఆలేరు ప్రజలకు ఇంకా చేయాల్సింది చాలా ఉందన్నారు.   ఆలేరు నుంచి కేసీఆర్ ఎవరికి అవకాశం ఇచ్చినా బీఆర్ఎస్ గెలుస్తుందన్నారు.