హైదరాబాద్: హుజురాబాద్ ఉపఎన్నికలో జయభేరి మోగించిన బీజేపీ నేత ఈటల రాజేందర్‌ది అసలు గెలుపే కాదన్నారు మాజీ మంత్రి, టీఆర్ఎస్ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు. కాంగ్రెస్ సాయంతో ఈటల గెలిచాడన్నారు. పార్టీనే అమ్ముకున్న రేవంత్ రెడ్డిని ఇలాగే వదిలేస్తే సోనియా గాంధీ కుటుంబాన్ని కూడా అమ్మేస్తాడన్నారు. ఓట్ల కోసమే బీజేపీ నేతలు డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. TRS ప్రభుత్వం దళితబంధు అమలు చేసి తీరతుందన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా దళితబంధు అమలవుతుందా అని మోత్కుపల్లి ప్రశ్నించారు. కేసీఆర్‌ను టచ్ చేస్తే బండి సంజయ్ మాడి మసైపోతాడని హెచ్చరించారు. బీజేపీ నేతలు మిలియన్ మార్చ్ ఎందుకు పెడుతున్నారో చెప్పాలన్నారు.
‘బండి సంజయ్.. డప్పు ఇక్కడ కాదు- ఢిల్లీలో కొట్టాలి. దళిత బంధు కావాలని కొడుతున్నారా? వద్దని కొడుతున్నారా? దళితబంధు దేశం అంతా అమలు అయ్యే వరకు టీఆర్ఎస్ వెంటాడుతుంది. కేసీఆర్‌కు దళితులంతా అండగా ఉంటాం. అంబేడ్కర్ వారసుడిగా కేసీఆర్ ముందుకెళ్తున్నారు. దళిత బంధు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా ఉందా? కుల వివక్ష పోగొట్టేందుకు బీజేపీ ఎక్కడైనా ప్రయత్నం చేసిందా? బీజేపీ వల్లే కులవ్యవస్థ ముందుకు నడుస్తోంది. బీజేపీ నేతలకు బుద్ధి ఉందా? ఓట్ల కోసం గారడి వేషాలు మానుకోవాలి. నా అనుభవంలో చాలా మంది సీఎంలను చూశా. దళితులకు వచ్చే లాభాన్ని అడ్డుకునే బీజేపీ వైఖరిని ఖండిస్తున్నా’ అని మోత్కుపల్లి చెప్పారు.