ఎవరు..ఎక్కడ తనిఖీ చేస్తున్నరు .. హెడ్డాఫీస్​ నుంచి డ్రైవ్​ను ​పర్యవేక్షిస్తున్న వాటర్​ బోర్డు ఎండీ

ఎవరు..ఎక్కడ తనిఖీ చేస్తున్నరు .. హెడ్డాఫీస్​ నుంచి డ్రైవ్​ను ​పర్యవేక్షిస్తున్న వాటర్​ బోర్డు ఎండీ
  •  సిటీలో కొనసాగుతున్న ‘మోటార్ ​ఫ్రీ ట్యాప్’ స్పెషల్​ డ్రైవ్
  •  ఎక్కడ ఎవరు తనిఖీలు  చేస్తున్నది కూడా చూడొచ్చు  
  • ఇప్పటివరకు నల్లాలకు మోటార్లు బిగించిన 892 మందిపై కేసులు

హైదరాబాద్​సిటీ, వెలుగు: గ్రేటర్​ పరిధిలో వాటర్​బోర్డు చేపట్టిన ‘మోటార్​ ఫ్రీ ట్యాప్’ స్పెషల్ ​డ్రైవ్​విస్తృతంగా కొనసాగుతుండగా, దీన్ని బోర్డు ఎండీ అశోక్​రెడ్డి హెడ్డాఫీసు నుంచి ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారు. ఉన్నతాధికారులు మొదలుకుని సెక్షన్​ కార్యాలయాల స్థాయి అధికారులంతా ఈ డ్రైవ్​లో పాల్గొంటున్నారు. ఎండీ కూడా కొద్ది రోజులు ఫీల్డ్​విజిట్​చేసి వినియోగదారులను కలిసి మాట్లాడి అవగాహన కల్పించారు. 

సరఫరా టైంలో నల్లాలకు మోటార్లు బిగించి నీటిని తోడేయడం వల్ల ఇతరులకు సరఫరా తక్కువ అవుతోందని, లోప్రెషర్​సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని, అందుకే ‘మోటార్​ ఫ్రీ ట్యాప్’ డ్రైవ్​ను ప్రవేశపెట్టామంటున్నారు. అధికారులు ప్రతి రోజూ అక్రమ మోటర్లను తనిఖీ నిర్వహిస్తూ దొరికిన వారికి జరిమానాలు విధిస్తుండగా, మరికొందరిపై కేసులు నమోదు చేస్తున్నారు. ఈ డ్రైవ్​ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఎండీ అశోక్​రెడ్డి ఇతర పనులతో హెడ్డాఫీసులో బిజీగా ఉన్నా టైం తీసుకుని మరీ తన చాంబర్​నుంచి పరిశీలిస్తున్నారు.  

జీపీఎస్​, కెమెరాల లింక్..

ఎండీ అశోక్​రెడ్డి ఆఫీసు నుంచి ప్రతి రోజూ ఎక్కడ డ్రైవ్​జరుగుతున్నా పర్యవేక్షిస్తున్నారు. దీని కోసం ఓ సిస్టమ్​ను ఏర్పాటు చేసుకున్నారు. ఆయన చాంబర్​లో ఎదురుగా ఉన్న భారీ డాష్​బోర్డుపై సిబ్బంది ఎక్కడ తనిఖీలు చేస్తున్నా ప్రత్యక్ష్యంగా చూస్తున్నారు.  దీని కోసం ఆర్క్​జీఐఎస్​సాఫ్ట్​వేర్ ఉపయోగిస్తున్నారు. ఇది సిబ్బంది, అధికారుల మొబైల్​యాప్​కు కనెక్ట్​అయి ఉంటుంది. ఎండీ ముందు ఉన్న స్క్రీన్​పై జీపీఎస్ ద్వారా సిబ్బంది ఎక్కడెక్కడ ఉన్నారో తెలుసుకుని కావాల్సిన చోటును ఆయన పరిశీలిస్తున్నారు. ఆఫీసర్లు ఎక్కడికి తనిఖీలకు వెళ్లారు? వారు అక్కడ ఏం చేస్తున్నారు? మోటర్లు పెట్టినవారికి ఫైన్లు వేస్తున్నారా లేదా? అన్న విషయాలను ఆయన చూస్తున్నారు. అవసరమైతే అక్కడి అధికారులు, సిబ్బందికి ఫోన్​ద్వారా సూచనలు ఇస్తున్నారు.  

892 కేసులు నమోదు

స్పెషల్​ డ్రైవ్​ ప్రారంభించిన వారం రోజుల్లోనే ఇప్పటి వరకూ ఎక్కడెక్కడ ఎంత మందిపై కేసులు పెట్టారన్నది కూడా డాష్​ బోర్డుపై కనిపిస్తుంది. దీనిపై డేటా ఎప్పటికప్పుడు అప్​డేట్​అవుతూ ఉంటుంది. ఇలా 21వ తారీఖు వరకు 892 మందిపై కేసులు నమోదు చేశారు. ఈ సందర్భంగా వాటర్​బోర్డు ఎండీ మాట్లాడుతూ తనిఖీల ద్వారా ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడం తమ లక్ష్యం కాదని, వినియోగ దారుల్లో అవగాహన కల్పించాలన్నదే తమ ఉద్దేశమన్నారు. నల్లాలకు మోటార్లు బిగించడం వల్ల ఇతరులకు తక్కువ నీరు వస్తుందని, అందరూ బిల్లులను కడుతున్నావారేనని, కానీ కొందరే ఎక్కువ నీటిని పొందేందుకు మోటార్లను బిగించడం సమంజసం కాదని అన్నారు.