- నత్తనడకన తీగలగుట్టపల్లి ఆర్వోబీ నిర్మాణ పనులు
- రోజుకు 20 సార్లు రైల్వే గేట్ బంద్‌తో వాహనదారుల అవస్థలు
- శాఖల మధ్య సమన్వయ లోపంతోనే పనుల్లో జాప్యం
కరీంనగర్, వెలుగు : కరీంనగర్-–చొప్పదండి మార్గంలోని తీగలగుట్టపల్లి రైల్వే గేట్‌తో వాహనదారుల కష్టాలు ఇప్పట్లో తీరేలా కనిపించడం లేదు. ఈ రైల్వే ట్రాక్ పై నిర్మిస్తున్న ఆర్వోబీ పనులను ఈ ఏడాది మార్చి వరకు పూర్తి చేయాలని డెడ్ లైన్ విధించినప్పటికీ.. ఇప్పటివరకు సగం పనులు కూడా పూర్తి కాలేదు. శాఖల మధ్య సమన్వయ లోపంతోపాటు బిల్లుల చెల్లింపుల్లో జాప్యంతో పనులు ఆగుతూ సాగుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ఇటీవల కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కాంట్రాక్టర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసినా.. పనుల్లో వేగం కనిపించడం లేదు. ఇదే పద్ధతిలో పనులు కొనసాగితే మరో ఏడాదైనా బ్రిడ్జి పనులు పూర్తి కావనే చర్చ జరుగుతోంది.
రోజుకు 20 సార్లు బంద్
కరీంనగర్ ఆర్వోబీ నిర్మాణంలో జాప్యంతో వాహనదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. అత్యవసర పనులపై వెళ్లేవారు నరకం అనుభవిస్తున్నారు. చాలాసార్లు అత్యవసర సేవల అందించే అంబులెన్స్‌లు కూడా చిక్కుకుపోతున్నాయి. నిత్యం వందలాది వాహనాలు వెళ్లే మార్గం కావడంతో గేట్ పడినప్పుడల్లా ట్రాఫిక్ స్తంభించిపోతుంది. రోజులో సుమారు 15 నుంచి 20 సార్లు లెవల్ క్రాసింగ్ వద్ద గేట్ పడుతోందని, గేట్ వేసినప్పుడల్లా.. పావు గంట ఇరువైపులా ట్రాఫిక్ నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.
కేంద్రమంత్రి చెప్పినా స్లోగానే పనులు..
సేతు బంధన్ ప్రాజెక్టులో భాగంగా కేంద్ర ప్రభుత్వ సెంట్రల్ రోడ్డు ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఫండ్(సీఆర్ఐఎఫ్) నిధులు రూ.154 కోట్లతో కరీంనగర్–- మంచిర్యాల రూట్‌లో ఆర్వోబీ నిర్మాణానికి 2023 జులై 13న అప్పటి మంత్రి గంగుల కమలాకర్ భూమిపూజ చేశారు. అదే నెల చివర్లో కాంట్రాక్టర్ అగ్రిమెంట్ చేసుకుని పనులు ప్రారంభించాడు. కానీ పనులు ఆగుతూ సాగుతున్నాయి. కాంట్రాక్టర్ బ్రిడ్జి నిర్మాణంలో భాగంగా రెండువైపులా ఫోర్ లేన్ ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మించాల్సి ఉండగా.. ఒకవైపు మాత్రమే రెండు వరుసల నిర్మాణం చేపట్టాడు. పనులు మూడు నెలల పాటు పూర్తిగా నిలిచిపోయాయి. గత నెలలో మళ్లీ ప్రారంభించారు.
ALSO READ : జీడిమెట్లలో భారీ అగ్నిప్రమాదం .. బాంబుల్లా పేలిన కెమికల్ డ్రమ్ములు
ఇప్పటి వరకు కరీంనగర్ వైపు 9 ఫిల్లర్ల నిర్మాణం జరగగా.. దీనిపై స్లాబ్ వేసే పనులు ఇప్పుడిప్పుడే మొదలు పెడుతున్నారు. చొప్పదండి వైపు మాత్రం కొద్ది దూరం పిల్లర్లపై స్లాబ్ వేశారు. ఆర్ అండ్ బీ, రైల్వే శాఖల సమన్వయ లోపంతోనే పనులు లేట్ అవుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ రెండుసార్లు స్వయంగా పరిశీలించి వీలైనంత త్వరగా పనులు పూర్తి చేయాలని ఇంజనీరింగ్ ఆఫీసర్లను ఆదేశించారు. ఇటీవల దిశ మీటింగ్‌లోనూ కాంట్రాక్టర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా పరిస్థితిలో మార్పు రాలేదు.