- నాలుగేండ్లుగా రెండు మోటార్లకు రిపేర్లు కరువు
నాగర్ కర్నూల్, వెలుగు: కృష్ణా నదిలో వరద ప్రవాహం పెరిగినా కేఎల్ఐ ప్రాజెక్ట్ పరిధిలో చెరువులు నిండడం లేదు. ప్రాజెక్ట్ పరిధిలోని ఎల్లూరులో ఐదు మోటార్లు ఉండగా, రెండు రిపేర్‌లో ఉన్నాయి. మిగిలిన మూడింటిలో ఒక మోటార్‌ను స్టాండ్‌బైగా ఉంచి రెండింటితో నీటిని ఎత్తిపోస్తున్నారు. దీంతో కృష్ణా నదిలో నీళ్లు పుష్కలంగా ఉన్నా నీటిని ఎత్తి పోసుకోలేని పరిస్థితి నెలకొంది.
ఆందోళనలో ఉమ్మడి పాలమూరు రైతులు
జొన్నలబొగడ, గుడిపల్లిగట్టు లిఫ్ట్‌లలో రెండు పంపులు మాత్రమే నడిపిస్తున్నారు. దీంతో కేఎల్ఐ పరిధిలోని 739 చెరువులను నింపి, ఉమ్మడి పాలమూరు జిల్లాలోని రైతులకు పూర్తి స్థాయిలో నీరందించలేని పరిస్థితి ఉంది. గత ప్రభుత్వం నాలుగేండ్లుగా మోటార్ల రిపేర్లను పట్టించుకోకపోవడంతోనే తమ పొలాలకు సాగునీరు అందడం లేదని రైతులు వాపోతున్నారు.
కృష్ణాకు వరదలు వచ్చినా..
కృష్ణానదికి జులై 17 నుంచి వరద ప్రారంభమై ఆగస్ట్5 నాటికి శ్రీశైలం రిజర్వాయర్‌లోకి 212 టీఎంసీల నీరు చేరడంతో 10 గేట్లు ఎత్తి నాగార్జున సాగర్‌కు నీటిని విడుదల చేశారు. 19 రోజుల వ్యవధిలో దాదాపు 160 టీఎంసీలు శ్రీశైలం నుంచి దిగువకు వదలడంతో పాటు ఏపీ వైపు ఉన్న పోతిరెడ్డిపాడు, ముచ్చుమర్రి నుంచి నీటిని తరలించడం ప్రారంభమైంది. అయితే ఇక్కడ మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది.
ఎల్లూరు పంప్‌హౌజ్‌లో ప్రమాదం జరిగినప్పటి నుంచి కేఎల్ఐకి కేటాయించిన 40 టీఎంసీల నీటిని వినియోగించుకోలేని దుస్థితి. ఐదు పంపుల్లో ఒకటి పూర్తిగా దెబ్బతినగా, ఐదో పంప్‌ను వినియోగించలేని పరిస్థితి ఉంది. ఉన్న మూడు పంపుల్లో రెండు పంపులను నడిపిస్తున్న ఇంజజనీర్లు.. ఒక పంపును స్టాండ్బైలో ఉంచారు. రెండు పంపుల ద్వారా ఎల్లూరు రిజర్వాయర్ నుంచి సింగో టం రిజర్వాయర్‌కు అక్కడి నుంచి జొన్నలబొగడకు, అక్కడి నుంచి లిఫ్ట్ చేసి గుడిపల్లి గట్టు రిజర్వాయర్‌కు నీటిని తరలించి ప్యాకేజీ 28, 29,30 పరిధిలో ఆయకట్టుకు సాగునీటిని అం దిస్తున్నారు.
నాలుగు జిల్లాల పరిధిలో 3.65లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీటిని అందించేందుకు 739 చెరువులు నింపాల్సి ఉంది. మూడు లిఫ్టుల్లో రెండు పంపులతో రోజు 1,600 క్యూసెక్కుల నీటిని లిఫ్ట్ చేస్తున్నారు. ఇక 29, 30 ప్యాకేజీల కింద ఉన్న రైతులు తమ ప్రాంతాలకు నీటిని ఎప్పుడు వదులుతారని ఇరిగేషన్ అధికారులను అడుగుతున్నారు.
గత పాలకులు, అధికారుల నిర్లక్ష్యం..
నాగర్‌కర్నూల్ జిల్లాలోని నాగర్‌కర్నూల్, కల్వకుర్తి, అచ్చంపేట, కొల్లాపూర్ నియోజకవర్గాల్లో 2,028 చెరువులున్నాయి. వనపర్తి, జడ్చర్ల, దేవరకద్ర నియోజకవర్గాలను మినహాయిస్తే జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో దాదాపు 739 చెరువులను కృష్ణా నీటితో నింపడానికి గతంలో నిర్ణయం తీసుకున్నారు. 100 ఎకరాల ఆయకట్టు మించిన 44 చెరువులను కేఎల్ఐ ఆన్లైన్ రిజర్వాయర్లుగా మార్చాలని 2018లో ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నా, ఇప్పటి వరకు వీటికి పైసా కేటాయించలేదు.
739 చెరువుల కింద దాదాపు 80వేల ఎకరాల ఆయకట్టు గుర్తించారు. చెరువులతో భూగర్భజలాలు పెరిగి బోర్ల కింద మరో లక్ష ఎకరాల వరకు సాగయ్యేది. మూడేండ్ల నుంచి తక్కువ వర్షపాతం కారణంగా 40 శాతం కూడా నిండలేదు. గత ఏడాది మినహా నాలుగేళ్లుగా కృష్ణా నదికి వరదలు వచ్చినప్పుడు చెరువులు నింపారు.
2020 అక్టోబర్‌లో ఎల్లూరు పంప్‌హౌజ్‌లో దెబ్బతిన్న రెండు పంపులను బాగు చేయించేందుకు చర్యలు తీసుకోలేదు. గత పాలకులు అటువైపు చూడకపోవడంతో మూడేండ్లుగా కేఎల్ఐ కింద రైతులకు కష్టాలు తప్పడం లేదు. అయితే పాడైన పంపులను పట్టించుకోకుండా, కాల్వల కెపాసిటీ పెంచకుండా, ఆన్లైన్ రిజర్వాయర్ల ఊసెత్తకుండా ఏటా ఆయకట్టు విస్తీర్ణాన్ని పెంచుకుంటూ పోయారు.
నాలుగు పంపులు నడిస్తేనే..
కేఎల్ఐ ప్రాజెక్ట్‌లోని మొదటి లిఫ్ట్ ఎల్లూరు పంప్‌హౌజ్‌లో కనీసం నాలుగు పంపులు నడిపిస్తే, రోజుకు 3,200 క్యూసెక్కుల నీటిని లిఫ్ట్ చేసే అవకాశం ఉంటుంది. కృష్ణానదికి మరో నెల రోజులు వరద ప్రవాహం కొనసాగితే ఎల్లూరు పంప్‌హౌజ్‌లో రెండు పంపులు, మోటార్ల ద్వారా వానాకాలం సాగుకు నీరందించడంతో పాటు చెరువులను నింపాల్సి ఉంటుంది. ఈ సారి పాత కథ చెప్పి తప్పించుకుంటే గత ఏడాది మాదిరిగానే యాసంగి ప్రశ్నార్థకమేనని ఆయకట్టు రైతులు పేర్కొంటున్నారు.