రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ నేతల మౌనదీక్ష..

బండి సంజయ్ అరెస్ట్ తో రాష్ట్రవ్యాప్త నిరసనలకు బీజేపీ నాయకత్వం పిలుపునిచ్చింది. అందులో భాగంగా రాష్ట్రస్థాయి నేతలు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మౌనదీక్ష చేపట్టారు. ఈ దీక్షలో లక్ష్మణ్, విజయశాంతి, ఎమ్మెల్యే రాజాసింగ్, మహిళా మోర్చా నేతలు, యెండల లక్ష్మీనారాయణ, ప్రధాన కార్యదర్శులు ప్రేమెందర్ రెడ్డి, ప్రదీప్ రావు, రాష్ట్ర కార్యదర్శి మాధవి చౌదరి, అధికార ప్రతినిధి పాల్వాయి రజనీ,SC మోర్చ రాష్ట్ర అధ్యక్షుడు కొప్పు భాషా, ఆయా జిల్లాల అధ్యక్షులు, పలువురు నేతలు పాల్గొన్నారు. ఉద్యోగుల పక్షాన పోరాడిన బండి సంజయ్ పై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపారని.. కేసీఆర్ సర్కార్ ను గద్దె దించే వరకు పోరాడుతామని నేతలు అన్నారు. శాంతియుతంగా దీక్ష చేస్తున్న సంజయ్ ని అరెస్టు చేయడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. ఉద్యోగులపై కేసీఆర్ ప్రభుత్వం నిరంకుశ వైఖరి అవలంభిస్తుందన్నారు. తక్షణమే జీవో 317ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మౌనదీక్ష దృష్ట్యా పార్టీ ఆఫీస్ ముందు పోలీసులు భారీగా మోహరించారు. 

కాగా.. కరీంనగర్ జైలులో ఉన్న బండి సంజయ్ ను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఎమ్మెల్యే ఈటల రాజేందర్, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి కలిశారు. హైదరాబాద్ పర్యటనకు రానున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను సాయంత్రం ఐదున్నర గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్టులో బీజేపీ నేతలు కలవనున్నారు. బండి సంజయ్ అరెస్టు, తర్వాత పరిణామాలను నడ్డాకు వివరించనున్నారు. అక్కడ బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి జేపీ నడ్డా మాట్లాడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అనంతరం సికింద్రాబాద్ లోని మహాత్మాగాంధీ విగ్రహం నుంచి ప్యారడైజ్ సర్కిల్ వరకు శాంతి ర్యాలీలో పాల్గొననున్నారు. 

బండి సంజయ్ అరెస్ట్ ను నిరసిస్తూ బీజేపీ 14 రోజుల పాటు నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. అందులో భాగంగా మంగళవారం జిల్లా, మండల  కేంద్రాల్లో నల్ల  బ్యాడ్జీలతో నిరసన చేపట్టనున్నారు.