తెలంగాణ కోసం కొట్లాడినోళ్లకు కొలువులేవి?

యూనివర్సిటీల్లో చదువులు పక్కకు పెట్టి, విలువైన సమయాన్ని పోగొట్టుకొని తెలంగాణ సాధనకు అహర్నిశలు పోరాటం చేసిన విద్యార్థులు.. స్వరాష్ట్రంలో ఉద్యోగాలు, ఉపాధి లేక ఆత్మహత్యల బాట పడుతుండటం అత్యంత బాధాకరమైన విషయం. నీళ్లు, నిధులు, నియామకాలే లక్ష్యంగా ఉద్యమానికి ఊపిరిలూది ముందుండి కొట్లాడిన విద్యార్థులకు సర్కారు న్యాయం చేయాలె. వివిధ శాఖల్లో ఖాళీల లెక్కలు తీసి వెంటనే నోటిఫికేషన్లు రిలీజ్​ చేసి ఉద్యోగాలు భర్తీ చేయాలి.

సెంటర్​ఫర్​ మానిటరింగ్​ ఇండియన్​ఎకానమీ లెక్కల ప్రకారం తెలంగాణలో అన్​ఎంప్లాయిమెంట్ ​రేట్​28.6 పాయింట్లు పెరిగి నిరుడు మే లో 34.8 శాతంగా నమోదైంది. ఏపీలో 14.8 పాయింట్లు పెరిగి 20.5 శాతంగా రికార్డయింది. ఈ లెక్కల ప్రకారం రెండు రాష్ట్రాల్లో నిరుద్యోగం పెరిగినట్లు స్పష్టంగా తెలుస్తోంది. లక్షలాది మంది యువతీ యువకులు ఏడేండ్లుగా ఉద్యోగాల నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్నారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం ప్రాణాలకు తెగించి కొట్లాడిన విద్యార్థులకు స్వరాష్ట్రంలో ప్రభుత్వం మొండిచేయి చూపుతోంది. ఆంధ్రపాలన నుంచి బయట పడి బంగారు తెలంగాణ నిర్మాణం చేసుకుంటున్న ఈ సందర్భంలో నిరుద్యోగుల ఆత్మహత్యలు రాష్ట్ర ప్రజలను కంటతడి పెట్టిస్తున్నాయి. ఉద్యోగ పోరాట ఘట్టంతోనే ఉద్యమం మొదలైంది. మలిదశ తెలంగాణ ఉద్యమం తీవ్ర స్థాయికి వెళ్లడానికి గల ప్రధాన కారణం పోలీసు​ కొలువుల భర్తీలో అన్యాయం జరగడమే. ఉద్యోగాల రిక్రూట్​మెంట్​లో ఆంధ్రా పాలకుల పక్షపాత ధోరణిని ప్రశ్నిస్తూ.. తెలంగాణ యువత తూటాలకు ఎదురొడ్డి ఉద్యమంలో ముందడుగు వేసింది. నిరుద్యోగులకు జరుగుతున్న అన్యాయంపై సభా వేదికల మీద ప్రసంగాలు దంచికొట్టిన నాయకులు కొట్లాడి తెచ్చుకున్న స్వరాష్ట్రంలోనూ వారికి న్యాయం ఎందుకు చేయడం లేదో అర్థం కాని పరిస్థితి. కొలువుల భర్తీకి ఎందుకు వెనుకంజ వేస్తున్నారో ప్రభుత్వ పెద్దలకే తెలియాలి. 
ఏడేండ్లుగా..​
రాష్ట్ర ఏర్పాటుతోనే ‘తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్’ పురుడు పోసుకుంది. సిలబస్ పేరుతో కాలయాపన జరిగినా.. నిరుద్యోగులు ఆశగానే ఎదురుచూశారు. స్వరాష్ట్రంలోనైనా తమకు ఉద్యోగాలు వస్తాయని ఆశించారు. ఏడాది, రెండేండ్లు, మూడేండ్లు ఇలా.. సంవత్సరాలు గడుస్తున్నాయే తప్ప.. ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఖాళీలు పూర్తి స్థాయిలో భర్తీ కావడం లేదు.  వివిధ శాఖల్లో లక్షా 7 వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయని అసెంబ్లీ సాక్షిగా స్వయంగా సీఎం ప్రకటించారు. అయినా.. ఆ పోస్టులు ఇప్పటి వరకు భర్తీ కావడం లేదు. విలువైన సమయాన్ని, విద్యను పక్కకు పెట్టి సంవత్సరాల తరబడి ఉద్యోగ సాధనలో నిమగ్నమైన యువత మొర ప్రభుత్వానికి పట్టడం లేదు. కొలువు వస్తే తమను కన్నవాళ్లకు గుక్కెడు గంజి పోద్దామనుకున్న విద్యార్థుల ఆశలు అడియాసలయ్యాయి. యునివర్సిటీలో పీహెచ్​డీ చేసిన స్టూడెంట్స్​ కూడా ఉద్యోగాల భర్తీ ప్రక్రియ జరగడం లేదని, నోటిఫికేషన్లు రావడం లేదనే బాధతో సూసైడ్​ చేసుకుంటున్నారు. మొన్న ఆ మధ్య కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం అందరినీ బాధపెట్టింది. ఎన్నో ఆశలతో ముందుకు సాగే విద్యార్థుల జీవితాలు సర్కారు నిర్లక్ష్య చర్యలతో అర్ధంతరంగా ముగుస్తున్నాయి. 
ఉమ్మడి పాలనలో..
యూనివర్సిటీల్లో పీజీలు, పీహెచ్​డీలు చేస్తున్న చాలా మంది గ్రామీణ విద్యార్థులు ఏండ్లుగా సర్కారు నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తున్నారు. రోజు రోజుకు వయసు పెరిగి పోతుండటంతో ఉద్యోగాలకు అర్హత కోల్పోతుండటంతోపాటు, అటు పెండ్లి చేసుకోలేక, ఇటు ప్రత్యామ్నాయ ఉపాధి మార్గం వెతుక్కోలేక నానా యాతన పడుతున్నారు. ఉద్యమానికి ఊపిరిలూదిన యువతను అక్కున చేర్చుకోవాల్సిన ప్రభుత్వం వారి గురించి పట్టించుకోవడమే మానేసింది. ఉమ్మడి పాలనలో ఉద్యోగాల కోసం పోరాటం చేస్తే ఆంధ్రా పాలకులు నయానికో, భయానికో కొన్ని నోటిఫికేషన్లు అయినా ఇచ్చేవారు.  వైఎస్​హయాంలో రెండు మూడు సార్లు డీఎస్సీ తదితర నోటిఫికేషన్లు వచ్చాయి. కిరణ్​కుమార్​రెడ్డి టర్మ్​లోనూ.. వేలాది టీచర్​పోస్టుల భర్తీ జరిగింది. కానీ నేడు స్వరాష్ట్రంలో ఎన్ని పోరాటాలు చేసినా ప్రభుత్వంలో కదలిక రావడం లేదు. ఎన్నికల ముందు అరకొర పోస్టులతో నోటిఫికేషన్లు ఇస్తున్న పాలకులు, వేలాది ఉద్యోగాలు భర్తీ చేశామని కాకిలెక్కలు చెప్తున్నారు. నోటిఫికేషన్లు రాక, ఇస్తామన్న నిరుద్యోగ భృతి కూడా ఇవ్వక నిరుద్యోగులు తీవ్రమనోవేదనలో ఉన్నారు. కొలువులు ఇవ్వచేతగాకనే నిరుద్యోగ భృతి అనే పథకాన్ని ప్రభుత్వం తీసుకొచ్చిందని, ఆ స్కీంను కూడా అమలు చేయడం లేదని విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. రాష్ట్ర సాధనకు ముందు నాలుగేండ్లు, తెలంగాణ వచ్చిన తరువాత దాదాపు ఏడేండ్లు ఆశించిన స్థాయిలో ఉద్యోగాల భర్తీ చేపట్ట లేదు. ఒక్క పోలీస్ కొలువుల భర్తీకి మాత్రమే ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది. మిగతా ఖాళీల భర్తీకి ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు.
గ్రూప్స్​ నోటిఫికేషన్​ జారీలో కాలయాపన
 ఒకప్పుడు గ్రూప్-2 కింద ఎగ్జిక్యూటివ్, నాన్ -ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉండేవి. నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టులను గ్రూప్-3 కిందకు మార్చిన సర్కారు.. వాటి భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వకుండా కాలయాపన చేస్తోంది. రెండింటికీ ఒకే రకమైన సిలబస్ ఉన్నప్పుడు పోస్టులను విడదీయాల్సిన మర్మమేమిటో సర్వీస్ కమిషన్ పెద్దలకే తెలియాలి. పంచాయతీ కార్యదర్శులు, జూనియర్​అసిస్టెంట్స్,​ టీఆర్​టీ, జేఎల్, డీఎల్ రిక్రూట్​మెంట్​ చేయాల్సి ఉన్నా ప్రభుత్వం నోటిఫికేషన్​ ఇవ్వడం లేదు. 50 వేల పోస్టులు భర్తీ చేస్తామని ప్రకటిస్తూ.. వస్తున్న నాయకులు ఎప్పుడు నోటిఫికేషన్​ ఇస్తారో చెప్పడం లేదు. యువతకు ఉపాధి చూపాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. అలా జరగనప్పుడు నిరుద్యోగం, పేదరికం పెరిగి, యువత చెడుమార్గాలు పట్టే ఆస్కారం ఉంటుంది. తద్వారా సమాజానికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం కొలువుల భర్తీకి ముందడుగు వేయాలి. దేశంలో కరోనా ఎఫెక్ట్​తో నిరుద్యోగం పెరిగింది. కంపెనీల్లో పని చేసే వారు జాబ్స్​ కోల్పోయి రోడ్డుమీద పడ్డారు. ఆదాయ మార్గాలు సన్నగిల్లాయి. స్వయం ఉపాధి దెబ్బతింది. చిన్న, మధ్య తరహా పరిశ్రమలు మూతపడ్డాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తంగా వ్యవహరించి ఉపాధి మార్గాలు అన్వేషించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.