60సీ కింద కాంట్రాక్టర్ మార్పుతో పనులు స్పీడప్
వచ్చే ఏడాది నాటికి కంప్లీట్ చేయాలని టార్గెట్
గద్వాల, వెలుగు: కృష్ణా నది మధ్యలో ఏకైక దివి గ్రామంగా ఉన్న గుర్రం గడ్డ ప్రజల కష్టాలు త్వరలోనే తీరనున్నాయి. 2018లో రూ.12 కోట్ల ఎస్టిమేషన్లతో గద్వాల మండలం గుర్రం గడ్డ దివి గ్రామానికి బ్రిడ్జి నిర్మాణ పనులను చేపట్టారు. అప్పటి ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఏడేండ్లుగా పనులు ముందుకు సాగలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గుర్రంగడ్డ బ్రిడ్జి నిర్మాణ పనులపై దృష్టి పెట్టి అప్పటి కాంట్రాక్టర్లు మార్చేసి 60-సీ కింద ఇటీవల వేరే కాంట్రాక్టర్ కు పనులు అప్పగించారు. బ్రిడ్జి నిర్మాణ పనుల్లో వేగం పుంజుకోగా, వచ్చే ఏడాది నాటికి కంప్లీట్ చేసి రాకపోకలు ప్రారంభించాలని టార్గెట్ గా పెట్టుకున్నారు.
వరద వస్తే కష్టాలే..
తెలంగాణ రాష్ట్రంలోనే కృష్ణా నదిలో ఉన్న ఏకైక దివి గ్రామంగా పేరు ఉన్న గుర్రం గడ్డ గ్రామస్తులకు కృష్ణా నదికి వరదలు వస్తే ప్రతి సంవత్సరం కష్టాలు తప్పడం లేదు. దాదాపు 2,100 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న గుర్రం గడ్డ గ్రామంలో 1,600 ఎకరాలకు పైగా సాగు భూమి ఉంది. ఇక్కడ 450 మంది ఓటర్లు ఉండగా, 600 కుటుంబాలు నివసిస్తున్నాయి. వరద వచ్చినప్పుడల్లా రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వ్యవసాయానికి అవసరమైన ఫర్టిలైజర్, ఇతర సామగ్రి తీసుకెళ్లాలంటే తప్పనిసరిగా బోట్లు, స్పీడ్ బోట్లను వాడాల్సి వస్తోంది. బ్రిడ్జి నిర్మాణం కంప్లీట్ అయితే గ్రామస్తుల కష్టాలు తీరనున్నాయి.
ఏడేండ్లుగా నిర్లక్ష్యం..
గత ప్రభుత్వం బ్రిడ్జి నిర్మాణ పనులను నిర్లక్ష్యం చేసింది. 2018లో పనులు స్టార్ట్ చేసినప్పటికీ బిల్లులు చెల్లించకపోవడంతో పనులు స్లోగా జరిగాయి. ఏడేండ్లుగా పనులు పిల్లర్లకే పరిమితమయ్యాయి. ఎన్నికల సందర్భంగా అప్పటి సీఎం కేసీఆర్ రూ.10 కోట్లు కాకుంటే, రూ.15 కోట్లు ఇచ్చి ఏడాదిలో కంప్లీట్ చేస్తామని చెప్పినప్పటికీ ఆ తరువాత దీనిని పట్టించుకోలేదు. దీంతో కొన్నేళ్లుగా ఆ పనులు మూలనపడ్డాయి. బిల్లులు రాకపోవడంతో కాంట్రాక్టర్ పనులు చేయకుండా, సామగ్రిని కూడా అప్పట్లో వెనక్కి తీసుకెళ్లడం చర్చనీయాంశంగా మారింది.
కాంట్రాక్టర్ మార్పుతో..
బ్రిడ్జి నిర్మాణ పనులను 2018లో స్వప్న కన్స్ట్రక్షన్ కంపెనీ దక్కించుకుంది. ఏడేండ్లుగా పనులు చేయకుండా ఆలస్యం చేయడంతో.. ఇటీవల ఆఫీసర్లు 60సీ కింద శ్రీనివాస ఇన్ ఫ్రా డెవలప్మెంట్ వారికి పనులు అప్పగించడంతో పనుల్లో వేగం పెరిగింది. బ్రిడ్జి నిర్మాణం కోసం 34 పిల్లర్లు నిర్మించాల్సి ఉండగా, ఇప్పటికే 26 పిల్లర్లు కంప్లీట్ అయ్యాయి. వచ్చే ఏడాది నాటికి బ్రిడ్జి నిర్మాణ పనులు కంప్లీట్ చేసి రాకపోకలు ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామని జూరాల ప్రాజెక్ట్ ఈఈ జుబేర్ అహ్మద్ తెలిపారు.