- వర్సిటీలో రోజుకో చోట ప్రత్యక్షం
- పడగవిప్పి బుసులు కొడుతున్న వైనం
- తీవ్ర భయాందోళనలో విద్యార్థులు
- రెండేళ్ల కిందట పాముకాటుతో ఒకరి మృతి
- సకాలంలో ఆస్పత్రికి తరలించడంతో నిలిచిన పలువురి ప్రాణాలు
ఉస్మానియా యూనివర్సిటీలో నాగుపాముల సంచారం కలకలం రేపుతోంది. రోజుకో చోట విషసర్పాలు ప్రత్యక్షం కావడంతో విద్యార్థులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. ఏ టైమ్‌లో ఎక్కడ నక్కుతున్నాయో తెలియక బెంబేలెత్తి పోతున్నారు.
ఓయూ, వెలుగు : వర్సిటీ ఆర్ట్స్ కాలేజీ భవన సముదాయంలోని ఎస్బీఐ ఏటీఎంలో ఈ నెల 12న ఓ వ్యక్తికి నాగుపాము పడగవిప్పి కనిపించడంతో.. భయంతో వెంటనే అక్కడి నుంచి పరుగులు తీశాడు. బుధవారం వర్సిటీ న్యూ పీజీ హాస్టల్ పార్కింగ్ స్థలంలో ఓ బైక్ వెనుక టైరు వద్ద అలాగే మరో పాము ప్రత్యక్షమైంది.
రెండ్రోజుల కిందట ఎన్ఆర్ఎస్- హాస్టల్ వద్ద ఓ చెట్టు తొర్రలో నుంచి నాగుపాటు బయటకు రాగా, స్టూడెంట్స్ వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్‌గా మారిది. ఆదివారం డీ-హాస్టల్ వద్ద పెద్ద నాగుపాము వాటర్ పైపునకు చుట్టుకొని ఉండగా, నీళ్ల కోసం అక్కడికి వెళ్లిన విద్యార్థులు విషసర్పాన్ని చూసి పరుగులు పెట్టారు. ఇటీవల ఓయూ ఎన్ఆర్ఎస్ హాస్టల్ డోరు సందులోనూ నాగుపాము కనిపించింది.
గతంలో కొన్ని ఘటనలు..
గతేడాది లేడీస్ హాస్టల్లో వంట మనిషిని పాము కాటు వేయడంతో సకాలంలో ఆస్పత్రి తరలించగా, ప్రాణాలతో బయటపడింది. రెండేళ్ల కిందట ఓయూ ఇంజినీరింగ్ కాలేజీ వెనుక క్యాంపులో అర్ధరాత్రి ఓ వ్యక్తి పాము కాటు గురై మృతి చెందాడు. అదే ఏడాది డీ-హాస్టల్లో యువతి, విష్ణు అనే పరిశోధనా విద్యార్థిని పాము కాటు వేసింది. ఇన్‌టైంలో ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందించడంతో ప్రాణాలు దక్కాయి. ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే, ఇలాంటి అనేక సంఘటనలు గతంలో చోటు చేసుకున్నాయి.
పెరుగుతోన్న పాముల సంఖ్య
గతంలో ఉస్మానియా యూనివర్సిటీలో రకరకాల పాములు ఉన్నప్పటికీ వాటి సంచారం కేవలం క్యాంపస్‌లోని అటవీ ప్రాంతానికి మాత్రమే పరిమితయ్యేది. కొన్ని సందర్బాల్లో పాములు రోడ్ల మీదకు వచ్చినా అవి ఎలాంటి హాని తలపెట్టలేదు. ఇటీవల కాలంలో ఓయూలో చెట్లను అధికంగా పెంచడంతో విషసర్పాలు సంచారం పెరిగింది. దీనికితోడు బయట కాలనీ, బస్తీలు, ఇతర ప్రాంతాల్లో పట్టుకున్న పాములను తెచ్చి ఓయూ క్యాంపస్‌లో వదిలిపెడుతున్నారు. ఫలితంగా వాటి సంఖ్య గణనీయంగా పెరిగి, హాస్టల్ గదుల వరకు రావడం మొదలుపెట్టాయి.
పాముల సంచారాన్ని అరికట్టాలి
అయితే, గతంలో ఇక్కడ పీజీ, పీహెచ్డీ చేసిన మహబూబ్‌నగర్‌కు చెందిన రవీందర్అనే విద్యార్థికి పాములను పట్టే అలవాటు ఉండేది. ఆ సమయంలో ఒక వేళ హాస్టళ్లలోకి పాములు దూరినా అతడు వాటిని పట్టుకుని చెట్ల పొదల్లో వదిలేసేవాడు. అలాగే ఓయూ జువాలజీ విభాగం ప్రొఫెసర్ శ్రీనివాసులకు కూడా పాములను పట్టే అలవాటు ఉంది. ప్రస్తుతం ఆయన పరిశోధనల్లో బీజీగా ఉన్నారు. ఈ క్రమంలో ఇప్పటికైనా ఓయూ అధికారులు స్పందించి హాస్టళ్ల పరిసర ప్రాంతాల్లో పాముల సంచారాన్ని అరికట్టేందుకు చర్యలు చేపట్టాలని విద్యార్థులు, అధ్యాపకులు కోరుతున్నారు.
పాముల సంచారాన్ని అరికడతాం
ప్రస్తుతం క్యాంపస్‌లో పాములు, కుక్కల సంఖ్య పెరిగింది. ఇందుకు ప్రధాన కారణం బయటి వ్యక్తులు ఆయా కాలనీలు, బస్తీలో పట్టిన పాములను తెచ్చి క్యాంపస్‌లో వదిలేస్తున్నారు. జీహెచ్ఎంసీ సిబ్బంది నగరంలో ఎక్కడ కుక్కలు పట్టుకున్నా వాటిని ఇక్కడికి తెచ్చి విడిచిపెడుతున్నారు. పాముల సంచారాన్ని అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఉన్నతాధికారులతో చర్చించి క్యాంపస్ హాస్టళ్లలో పాములు రాకుండా స్నేక్ క్యాచర్స్‌ను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటాం.
చీఫ్ వార్డెన్ కొర్రెముల శ్రీనివాస్ రావు