కారిడార్ వైపు టైగర్

కారిడార్ వైపు టైగర్
  • కవ్వాల్ జోన్ కోసం అన్వేషణ
  • మహారాష్ట్ర కిన్వట్ అడవిలోని జానీగా అనుమానం
  • ఇదే పులి గతంలో భైంసాలో సంచరించిందంటున్న సిబ్బంది
  • మామడ అడవుల్లో ఎద్దును చంపిన పులి
  • రెండ్రోజుల నుంచి కలకలం

నిర్మల్, వెలుగు: కొద్ది రోజులుగా ఓ పెద్దపులి నిర్మల్ జిల్లాలో సంచరిస్తూ కలకలం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆ పెద్దపులి కవ్వాల్ టైగర్ జోన్ దారి కోసం వెతుకుతోందని, జత కోసం అన్వేషిస్తోందని ఫారెస్ట్ ఆఫీసర్లు భావిస్తున్నారు. ఈ పులి మహారాష్ట్రలోని కిన్వట్ ప్రాంతంలో నివసించే ‘జానీ’ అయి ఉండొచ్చని ఫారెస్ట్ ఆఫీసర్లు అనుమానిస్తున్నారు.

గతంలో కూడా ఈ పెద్దపులి భైంసా ప్రాంతంలోని అటవీ గ్రామాల్లో సంచరించినట్లు అధికారులు చెబుతున్నారు. ఇప్పుడు మళ్లీ అటువైపు నుంచి జిల్లాలోకి వచ్చిందని భావిస్తున్నారు. వన్యప్రాణులకు కవ్వాల్ టైగర్ జోన్ సురక్షిత ప్రాంతం కావడంతో ఈ పెద్ద పులి అటు దిశగా వెళ్లేందుకే ప్రయత్నిస్తోందని ఫారెస్ట్​ఆఫీసర్లు చెబుతున్నారు. దారి వెతుక్కుంటున్న క్రమంలోనే కనిపించిన పశువులపై దాడి చేస్తోందని పేర్కొంటున్నారు. 

ఎద్దుపై దాడి.. భయాందోళనలో ప్రజలు

జిల్లాలోని సారంగాపూర్ మండలం అడెల్లితోపాటు కుంటాల, నర్సాపూర్ మండలాల్లోని పలు గ్రామాల్లో పులి సంచరించిన సంగతి తెలిసిందే. మొదట బోథ్ వైపు నుంచి జిల్లాలోకి ప్రవేశించిన పులి.. సారంగాపూర్, కుంటాల, నర్సాపూర్ మండలాల్లో సంచరించింది. సోమవారం రాత్రి ఇక్కడి మహబూబ్ ఘాట్​పై సంచరించడాన్ని పలువురు వీడియో తీసి సోషల్​మీడియాలో పెట్టడంతో వైరలైంది. పులి అక్కడ కనిపించిన కొన్ని గంటలు గడవకముందే మామడ మండలం అంకెన గ్రామ పంచాయతీ పరిధిలోని బురకరేగడిలో ఓ ఎద్దుపై దాడి చేసి హతమార్చింది. దీంతో ప్రజలు భయంభయంగా గడుపుతున్నారు. 

అధికారుల అలర్ట్.. పాదముద్రలపై ఆరా..

పులి సంచారంపై ఫారెస్ట్ ఆఫీసర్లు, సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఇప్పటివరకు పులి తిరిగిన ప్రాంతాల్లో పాదముద్రలతో పాటు ఇతర ఆధారాల కోసం అన్వేషిస్తున్నారు. పులి సంచార శైలిని లోతుగా విశ్లేషిస్తున్న ఫారెస్ట్ ఆఫీసర్లు పెద్దపులి సురక్షిత ప్రాంతమైన కవ్వాల్ టైగర్ జోన్ వైపు వెళ్లేందుకు ప్రయత్నిస్తోం దని, జత కోసం కూడా అన్వేషిస్తోందని చెబుతు న్నారు. దారి వెతుక్కునేందుకు కొన్ని గుర్తులు, వాసనలను ఆధారం చేసుకుంటోందని, ఈ క్రమంలోనే ఆహారం కోసం పశువులపై దాడి చేస్తోందని చెబుతున్నారు. 

సురక్షిత ప్రాంతంలోకి చేరుకునే వరకు పెద్దపులి ఇలా సంచరిస్తూనే ఉంటుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆఫీసర్లు సూచిస్తున్నారు. ప్రస్తుతం బురకరేగడి గ్రామ పరిధిలో సంచరిస్తున్న పెద్దపులి అక్కడ నుంచి రాసి మెట్ల, సింగాపూర్ గ్రామాల పైపు వెళ్లే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ప్రజలు ఒంటరిగా అటవీ ప్రాంతాల్లోకి వెళ్లొద్దని.. పశువులు, మేకలను మేత కోసం అడవుల్లోకి తీసుకెళ్లవద్దని సూచిస్తున్నారు.

కంఫర్ట్ జోన్ కోసం అన్వేషిస్తున్న పులి

తనకు కంఫర్ట్ ప్రాంతమైన కవ్వాల్ టైగర్ జోన్ దారి కోసం పెద్దపులి అన్వేషిస్తోంది. జత కోసం కూడా వెతికే అవకాశం ఉంది.  పెద్దపులి సురక్షితంగా కవ్వాల్ జోన్​లోకి వెళ్లేలా చర్యలు తీసుకుంటాం. జిల్లాలో పెద్దపులి సంచరిస్తున్న కారణంగా ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలి. అడవుల్లోకి ఒంటరిగా వెళ్లవద్దు. పెద్దపులికి ఎలాంటి హాని జరగకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉంది.- నాగిని భాను, డీఎఫ్​వో, నిర్మల్ జిల్లా