వెలుగు సక్సెస్ : నిజాం రాజ్యంలో ఉద్యమాలు

దేశ స్వాతంత్ర్యోద్యమంలో భాగంగా ఎన్నో ఉద్యమాలు జరిగాయి. వాటి ప్రభావం నిజాం రాజ్యంపై ఎంతో కొంత ఉంది. ముఖ్యంగా వహాబీ, స్వదేశీ, ఖిలాఫత్​, క్విట్​ ఇండియా ఉద్యమాలను నిజాం రాజ్యంలో ఉధృతంగా జరిగాయి. వందేమాతర ఉద్యమంలో పాల్గొన్న పీవీ నరసింహారావు, మర్రి చెన్నారెడ్డి, హయగ్రీవాచారిలు దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు.

వహాబీ ఉద్యమం 

సయ్యద్​ అహ్మద్​ బరేలి నాయకత్వంలో 1839లో వహాబీ ఉద్యమం ప్రారంభమైంది. ఈ ఉద్యమానికి హైదరాబాద్​లో ముబారిజ్​ ఉద్దౌలా (నాసిర్​ ఉద్దౌలా తమ్ముడు) నాయకత్వం వహించాడు. ఇతనిని ఆంగ్లేయులు అరెస్టు చేసి గోల్కొండ కోటలో బంధించారు. అక్కడే ముబారిజ్​ ఉద్దౌలా 1854లో మరణించారు. వహాబీ ఉద్యమంలో ముబారిజ్​ ఉద్దౌలాకు కర్నూల్​ నవాబ్​ గులాం రసూల్​ ఖాన్​ సహకరించాడు. రసూల్​ ఖాన్​ను బ్రిటిష్​వారు అరెస్టు చేసి తిరుచురాపల్లికి పంపించారు. దీంతో హైదరాబాద్​లో వహాబీ ఉద్యమం అంతమైంది. 

స్వదేశీ ఉద్యమం 

1905, అక్టోబర్​ 16న బెంగాల్​ విభజన జరిగింది. దీనికి వ్యతిరేకంగా వందేమాతర ఉద్యమం లేదా స్వదేశీ ఉద్యమం నిర్వహించారు. ఈ ఉద్యమంలో భాగంగా స్వదేశీ ఉత్పత్తులను మాత్రమే వినియోగించి విదేశీ వస్తువులను బహిష్కరించాలి. ఆ తర్వాత కాలంలో బహిష్కరణ కేవలం వస్తువులకు మాత్రమే కాకుండా బ్రిటిష్​ సంస్థలకూ వర్తింపజేశారు. 1905లో ప్రారంభమైన వందేమాతర ఉద్యమం హైదరాబాద్​ సంస్థాన ప్రజలపై కూడా ప్రభావం చూపింది. నిజాం సంస్థానంలో స్వదేశీ ఉద్యమ వ్యాప్తికి అప్పాజి తుల్జా పుర్కార్​, దామోదర్​ సత్యలేఖర్​ కృషి చేశారు. వీరి కార్యకలాపాలు నిజాంకు తెలిసి వీరిని రాజ్యం నుంచి బహిష్కరించాడు. ఆర్య సమాజం, గణేష్​ ఉత్సవ సంఘం తదితర సంస్థలు కూడా స్వదేశీ ఉద్యమాన్ని వ్యాప్తిలోకి తెచ్చేందుకు ప్రయత్నించాయి. సహాయ నిరాకరణోద్యమ సమయంలో హైదరాబాద్​ అవతల చదువుతున్న అనేక మంది విద్యార్థులు తమ చదువులకు స్వస్తి చెప్పి సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొన్నారు. 1921లో సరోజిని నాయుడు కుమారుడు జయసూర్య తన మెడికల్​ కోర్సును మానేశాడు. 

ఖిలాఫత్​ ఉద్యమం

1919లో మొదటి ప్రపంచ యుద్ధం అనంతరం బ్రిటిష్​ వారు టర్కీని ఆక్రమించి ఖలీఫా పదవిని రద్దు చేశారు. టర్కీ ఖలీఫా పదవిని పునరుద్ధరించాలని కోరుతూ భారతదేశంలో మహ్మద్​ అలీ, షౌకత్​ అలీ సోదరులు ఖిలాఫత్​ ఉద్యమాన్ని ప్రారంభించారు. 1919లో ఆల్​ ఇండియా ఖిలాఫత్​ కాన్ఫరెన్స్​ను ఢిల్లీలో నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్​కు మహాత్మా గాంధీ అధ్యక్షత వహించారు. ఈ ఉద్యమం ద్వారా మహాత్మా గాంధీ ముస్లింలను జాతీయోద్యమంలోకి తీసుకురావడానికి ప్రయత్నించారు. దీని ఫలితంగా ఖిలాఫత్​ ఉద్యమం హైదరాబాద్​లోని ముస్లింలను కూడా విశేషంగా ఆకర్షించింది. కేశవరావు కొరాట్కర్​, వామన్​ నాయక్​లు హైదరాబాద్​లో స్వరాజ్​ ఫండ్​ను ఏర్పర్చారు. ఖిలాఫత్​ ఉద్యమానికి ప్రముఖ ముస్లిం నాయకులు అన్సారీ, మౌలానా సోదరులు, అజ్గర్​ హసన్​, హుమాయున్​ మీర్జా మద్దతు ప్రకటించారు. ఈ ఉద్యమానికి హైదరాబాద్​ హిందూ నాయకులు కేశరావు కొరాట్కర్​, వామన్​రావ్​ నాయక్​, మందముల నరసింగరావు మద్దతు తెలిపారు. 1920 ఏప్రిల్​ 23న ఖిలాఫత్​ డే సందర్భంగా హైదరాబాద్​లోని వివేకవర్ధిని మైదానంలో బహిరంగ సభ నిర్వహించారు. 1920, మే 5న హైదరాబాద్​ ఖిలాఫత్​ కమిటీ ఆధ్వర్యంలో ఐక్యతా దినం పాటించారు. ఖిలాఫత్​ భావాలను హైదరాబాద్​ ఉర్దూ పత్రికలైన జమీందార్​, సియాసత్​, జమాన ప్రచారం చేశాయి. 

క్విట్​ ఇండియా ఉద్యమం 

1942, ఆగస్టులో బొంబాయిలో జరిగిన జాతీయ కాంగ్రెస్​ సమావేశంలో క్విట్​ ఇండియా ఉద్యమ తీర్మానం చేశారు. 1942 ఆగస్టు 8న క్రాంతి మైదాన్​ నుంచి మహాత్మా గాంధీ క్విట్​ ఇండియా ఉద్యమ ప్రకటన చేశారు. ఈ ఉద్యమ సమయంలో జాతీయ కాంగ్రెస్​కు మౌలానా అబుల్​ కలాం ఆజాద్​ అధ్యక్షుడిగా ఉన్నారు. హైదరాబాద్​ సంస్థానంలో క్విట్​ ఇండియా నినాదాలు ఇస్తున్నందుకు బూర్గుల రామకృష్ణారావు, రామానంద తీర్థ లాంటి వారిని నిజాం ప్రభుత్వం అరెస్టు చేసింది. క్విట్​ ఇండియా ఉద్యమ సమయంలో హైదరాబాద్​ రెసిడెన్సీ ప్రాంతంపై పద్మజానాయుడు, జ్ఞాన్​కుమారి హెడా, టి.రామస్వామి జాతీయ జెండా ఎగురవేశారు. ప్రభాకర్​ జీ క్విట్​ ఇండియా ఉద్యమ తీర్మానాన్ని హైదరాబాద్​ సంస్థానంలోని ఎం.ఎస్​.రాజలింగానికి పంపించారు. ఎం.ఎస్.రాజలింగం వరంగల్​కు వెళ్లి హయగ్రీవాచారి, భూపతి కృష్ణమూర్తిల ద్వారా క్విట్​ ఇండియా ఉద్యమం నిర్వహించారు. హైదరాబాద్​లో క్విట్​ ఇండియా ఉద్యమాన్ని వ్యాప్తి చేయడంలో డాక్టర్​ మేల్కోటే కీలకపాత్ర పోషించారు. అరుణా అసఫ్​ అలీ హైదరాబాద్​లో రహస్యంగా పర్యటించి క్విట్​ ఇండియా ఉద్యమాన్ని వ్యాప్తి చేసింది. పద్మజానాయుడు హైదరాబాద్​ రెసిడెన్సీ భవనంపై కాంగ్రెస్​ పతాకాన్ని ఎగురవేసింది. 1942 ఉద్యమ కాలంలో భారతదేశం వెలుపల సుభాష్​ చంద్రబోస్​ నాయకత్వంలో రూపొందించిన ఆజాద్​ హింద్​ ఫౌజ్​లో హైదరాబాద్​కు చెందిన ఆబిద్​ హసన్​ సఫ్రాని, సురేష్​ చంద్రలు చేరారు.  

వందేమాతర ఉద్యమం

ఉస్మానియా విశ్వవిద్యాలయం బి హాస్టల్​ హిందూ విద్యార్థులు 1938 దసరా ఉత్సవాల సందర్భంగా వందేమాతర గీతాన్ని ఆలపించారు. ఈ విషయమై ముస్లిం విద్యార్థులు వార్డెన్​కు ఫిర్యాదు చేయడంతో వందేమాతరం పాడకుండా తాత్కాలికంగా నిషేధించారు. దసరా సెలవుల అనంతరం 1938 నవంబర్ 28న వందేమాతరం పాడకుండా ఫర్మానా జారీ అయింది. అంతేకాకుండా విద్యార్థులందరూ పైజామా, నీలిరంగు షేర్వాణి ధరించాలని నియమం ఉండేది. దీనిని నిరసిస్తూ విద్యార్థులు ఉద్యమాలు చేశారు. హిందూ విద్యార్థులు హాస్టల్​ ఖాళీ చేసి సుల్తాన్​బజార్​లోని జైనమందిరంలో వసతి పొందారు. ఫర్మానాను బేఖాతరు చేస్తూ 1938 నవంబర్​ 29న అచ్యుతరెడ్డి నాయకత్వంలో వందేమాతర ఉద్యమ ప్రారంభించారు. ఈ ఉద్యమంలో పి.వి.నరసింహారావు, మర్రి చెన్నారెడ్డి, ధర్మభిక్షం, హయగ్రీవాచారి, వందేమాతరం రామచంద్రరావు పాల్గొన్నారు. డిసెంబర్​ 10న క్షమాపణ చెబితే కాలేజీకి రావచ్చని లేదంటే యూనివర్సిటీ నుంచి బహిష్కరించాల్సి ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. కాని విద్యార్థులు క్షమాపణలు చెప్పకుండా ఉద్యమంలో పాల్గొనేసరికి విద్యార్థుల పేర్లను తొలగించారు. ఆ విధంగా ఉస్మానియా యూనివర్సిటీ నుంచి 350, గుల్బార్గా కాలేజీ నుంచి 310, నిజాం సిటీ కాలేజ్​ నుంచి 70, మహబూబ్​నగర్​ హైస్కూల్​ నుంచి 120 మంది విద్యార్థుల అడ్మిషన్​ రద్దయింది.