సినిమా కలెక్షన్లకు అవార్డులకు లింకే లేదు

సినిమా కలెక్షన్లకు అవార్డులకు లింకే లేదు

ఏటా ఆస్కార్​ నామినేషన్​ సీజన్​ మొదలవగానే మనల్ని మనమే కించపరచుకునేలా కామెంట్లు వినిపిస్తాయి. ఇంత పెద్ద దేశంలో ఆస్కార్​ అవార్డు కొట్టగల రేంజ్​ సినిమా ఒక్కటీ లేదనేస్తారు. ఇది నిజమా?!. దేశంలో ప్రతి ఏడాది 26 భాషల్లో 1,600 వరకు సినిమాలు రిలీజవుతున్నాయి. సోషల్​ కాజ్​కి కమర్షియల్​ ఎలిమెంట్స్​ జోడించి తీసే ఇండియన్​ సినిమాలు బాక్సాఫీసు దగ్గర కోట్లు వసూళ్లు చేస్తున్నాయి. టెక్నికల్​గా మన సినిమా హాలీవుడ్​ స్థాయిని అందుకుంటోంది. మన దగ్గరున్నన్ని కథలు, పాత్రలు ప్రపంచంలో మరే దేశంలోని సినిమా ఇండస్ట్రీలోనూ లేవని ఢంకా బజాయించి చెప్పొచ్చు.

‘ఆడియన్స్​ ఆదరించిందే అత్యుత్తమ చిత్రం’ అన్నారు ఎన్​.టి.రామారావు. ఆయన దాదాపు 400 సినిమాల్లో నటించినా కేవలం రెండు, మూడు  సినిమాలకే ‘ఉత్తమ ప్రాంతీయ చిత్రం’ అవార్డులు వచ్చాయి. అసలు జాతీయ స్థాయిలోనే తెలుగు సినిమాకి ఉత్తమ ఫీచర్​ ఫిల్మ్​ అవార్డు ఒకే ఒక్కసారి (2015లో ‘బాహుబలి’కి) వచ్చింది.  అలాగని తెలుగు సినిమా స్టామినాని తక్కువచేసి చూడలేం. ఏటా ఆస్కార్​ అవార్డుల నామినేషన్​ సీజన్​ మొదలవగానే మనల్ని మనమే కించపరచుకునేలా కామెంట్లు వినిపిస్తుంటాయి. ఇంత పెద్ద దేశంలో ఆస్కార్​ అవార్డు కొట్టగల రేంజ్​ సినిమా మనకొక్కటీ లేదనేస్తారు.

ఎన్టీఆర్​ అన్నట్లుగా మనది పాపులర్​ సినిమా. మన సినిమాకి మార్కెట్​ పరిధి ఉంది. ఇప్పుడిప్పుడే ఓవర్సీస్​ మార్కెట్​లోకి ఎంట్రీ ఇచ్చి, మన ముద్ర చాటుకుంటున్నాం. ఈ రోజు దేశమంతా టాలీవుడ్ ​వైపు చూసే రేంజ్​కి ఎదిగాం. తమిళ సినిమా కోలీవుడ్, మలయాళ పరిశ్రమ మల్లువుడ్​, కన్నడ ఇండస్ట్రీ శాండల్​వుడ్​ వగైరా పేర్లతో ఎంటర్​టైన్​మెంట్​ రంగంలో రాణిస్తున్నాయి. ఈ మధ్యనే రాజస్థానీ సినీ పరిశ్రమ రాలీవుడ్​గా ప్రవేశించి ఏడాదికి పదీ, పదిహేను సినిమాలు తీయగలుగుతోంది.

దేశంలో కాశ్మీర్​ మొదలుకొని కన్యాకుమారి వరకు ఏటా 26 భాషల్లో 1,600కి పైగా సినిమాలు తీస్తుంటారు. తెలుగు, హిందీ, తమిళం వంటి కొన్ని ప్రధాన భాషల్లో 200 పైచిలుకు సినిమాలు వస్తుంటే; ఒడియా, భోజ్​పురి లాంటి భాషల్లో 100 లోపు సినిమాలు రిలీజవుతుంటాయి. అన్ని భాషల్లోనూ పాపులర్​ సినిమాలు తీయటం ఇండియా ప్రత్యేకత. ప్రపంచవ్యాప్తంగా మార్కెట్​ ఉన్న హాలీవుడ్​తో పోటీ పడే స్థాయిలో ఇండియన్​ సినిమా ఎదిగింది. టెక్నాలజీపరంగా మనకున్న ఆర్థిక, సాంకేతిక వనరుల్లో బెస్ట్​ ప్రొడక్ట్​ ఇవ్వగలుగుతున్నాం. హాలీవుడ్​ తర్వాత ప్రపంచవ్యాప్తంగా వెయ్యి స్క్రీన్లలో ఒకేసారి విడుదల చేయగల సత్తా ఉన్న సినిమా ఇండస్ట్రీ ఇండియాలోనే ఉంది.

అసలు ఆస్కార్​ అవార్డులు ప్రపంచ సినిమాకి ఇవ్వరనే విషయం చాలా మందికి తెలియదు. అది హాలీవుడ్​లో లేదా అమెరికన్​ దర్శక, నిర్మాతలు బయట తీసే ఇంగ్లిష్​ పిక్చర్లకు ఇస్తారు. బ్రిటిష్​వాళ్లు తమ కోసం ‘బ్రిటిష్​ అకాడమీ’ని పెట్టుకొని సినిమా, టీవీ రంగాల్లో ఉత్తమమైనవాటికి అవార్డులు ఇచ్చుకుంటారు. బ్రిటిష్​ అకాడమీ ఆఫ్​ ఫిల్మ్​ అండ్​ టెలివిజన్​ ఆర్ట్స్​ (బాఫ్టా) ఇచ్చే అవార్డులు కాబట్టి వాటిని ‘బాఫ్టా’ అవార్డులంటారు. 1998లో హాలీవుడ్​వాళ్లు తాము తీసుకున్న ‘షేక్​స్పియర్​ ఇన్​ లవ్​’ సినిమాకి ఇచ్చుకోగా బాఫ్టావాళ్లు తమ దగ్గర తీసిన ‘షేక్​స్పియర్స్​ రోమియో అండ్​ జూలియట్​’కి ఇచ్చుకున్నారు. ఇలాంటి పోటీ అప్పుడప్పుడు జరుగుతుంది.

ఇప్పటివరకు 91 సార్లు ఆస్కార్​ అవార్డులు ప్రకటించారు. వచ్చే ఫిబ్రవరి 24న ఇచ్చేవి 92వ ఆస్కార్​ అవార్డులు. వీటిని అమెరికాలోని చిత్ర పరిశ్రమను ప్రోత్సహించడం కోసం అక్కడి ఫిల్మ్​ మేకర్లు 1927లో చేసుకున్న ఏర్పాటిది. అకాడమీ ఆఫ్​ మోషన్​ పిక్చర్​ ఆర్ట్స్​ అండ్​ సైన్సెస్​వారు​ ఏటా హాలీవుడ్​లో నిర్మించిన ఇంగ్లిష్​ సినిమాలకు గోల్డ్​ కోటింగ్​ వేసిన ప్రతిమను అవార్డుగా ఇస్తారు. వీటినే అకాడమీ అవార్డు లేదా ఆస్కార్​ అవార్డుగా పిలుస్తారు. బెస్ట్​ ఫిల్మ్​, బెస్ట్​ డైరెక్టర్, యాక్టర్, యాక్ట్రెస్​, ఒరిజినల్​ స్కోర్​ (సంగీతం) వంటి 24 కేటగిరీల్లో ఆస్కార్​ అవార్డులిస్తారు. బయటి దేశాల నుంచి వచ్చే ఇతర భాషా చిత్రాలకు కూడా అవార్డు ఇస్తారు. అలాంటివాటికి బెస్ట్​ ఇంటర్నేషనల్​ ఫీచర్​ ఫిల్మ్​ కింద ఒకటే అవార్డు ప్రకటిస్తారు. ఈ అవార్డు కోసం ప్రపంచ దేశాల నుంచి ఎంట్రీలను తీసుకుని బాగా వడపోస్తారు.

మన దేశంలో అవార్డ్​ విన్నింగ్​ సినిమాలకు ప్రేక్షకాదరణ అంతంతమాత్రంగా ఉంటుంది. ఆస్కార్​ అవార్డులు అందుకున్న సినిమాల పరిస్థితి కూడా అంతే. బాక్సాఫీసుని కలెక్షన్లతో హోరెత్తించిన సినిమాలకు కనీసం బెస్ట్​ ఫిల్మ్​ నామినేషనైనా దక్కదు. కాబట్టి, మనం వరల్డ్​ సినిమాలో వెనకబడ్డామనే ఆలోచన అక్కర్లేదు. తెలుగు సినిమా స్టామినా ఇప్పుడు రూ.100 కోట్ల వసూళ్లకు ఎదిగింది. టెక్నికల్​గా ‘బాహుబలి’లాంటి అద్భుత చిత్రాన్ని తీయగలిగిన చరిత్ర టాలీవుడ్​దే. సోషియో కాన్​ఫ్లిక్ట్​​ ఇష్యూలతో ‘రంగస్థలం’, ‘భరత్​ అను నేను’, ‘మహర్షి’, ‘అర్జున్​రెడ్డి’ లాంటి భిన్న కథాంశాలతో టాలీవుడ్​ రేంజ్​ని పెంచగలుగుతున్నారు.