ప్రభుత్వాసుపత్రుల్లో అన్ని సౌకర్యాలున్నాయని అటు ప్రభుత్వం ఇటు అధికార పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు గొప్పలు చెప్పుకుంటుంటారు. కానీ.. అక్కడక్కడ ఇంకా మౌలిక సదుపాయలు లేని ఆసుపత్రులున్నాయి. అలాగే చనిపోతే.. కనీసం అంబులెన్స్ సౌకర్యం లేకపోవడంతో చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. ఓ వైపు కుటుంబసభ్యుడు చనిపోయిన బాధ.. మరోవైపు ఇంటికి డెడ్ బాడీని ఎలా తీసుకెళ్లాలో తెలియని సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతున్నారు.
కొంతమంది మానవత్వం చాటుకుని.. మృతదేహాలను తరలిస్తున్నారు. ఇలాంటి ఘటనే ఒకటి మహబూబాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. గార్ల మండల కేంద్రంలోని ప్రభుత్వ హాస్పటల్ లో ఆర్మూరి పద్మ చనిపోయింది. మృతదేహాన్ని తీసుకెళ్లడానికి అంబులెన్స్ ఇవ్వాలని కోరారు. కానీ.. ఆసుపత్రిలో అంబులెన్స్ లేకపోవడంతో ఏమి చేయాలో తెలియని పరిస్థితిలో కొట్టుమిట్టాడారు. ప్రైవేటు అంబులెన్స్ ల వారిని సంప్రదిస్తే.. రూ. 5 నుంచి రూ. 10 వేలు డిమాండ్ చేశారు. అంత ఇచ్చుకోలేని పరిస్థితి ఉండడంతో తీవ్ర ఆవేదన చెందారు. కొంతమంది యువకులు స్పందించి మానవత్వం చాటుకున్నారు. వీల్ ఛైర్ లో తీసుకెళ్లారు. వీరిని స్వచ్చంద సంఘాలు, స్థానికులు అభినందించారు.