ఇవన్నీ కాదు.. పీఓకేను తీస్కుందాం.. ప్రధాని మోడీకి అభిషేక్ బెనర్జీ సూచన

ఇవన్నీ కాదు.. పీఓకేను తీస్కుందాం.. ప్రధాని మోడీకి అభిషేక్ బెనర్జీ సూచన

కోల్​కతా: పాకిస్తాన్‎కు గుణపాఠం నేర్పించి, పాక్ ఆక్రమిత కాశ్మీర్(పీఓకే)ను తిరిగి స్వాధీనం చేసుకోవాలని తృణమూల్ కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ అభిషేక్ బెనర్జీ అన్నారు. అంతే తప్ప ఆ దేశంపై సర్జికల్ స్ట్రైక్స్​లేదా సింబాలిక్​ బెదిరిపులకు ఇది సమయం కాదన్నారు. నిర్ణయాత్మక చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. 26 మందిని బలిగొన్న పహల్గామ్ టెర్రరిస్టు ఎటాక్​పై ఆదివారం అభిషేక్ బెనర్జీ ఎక్స్‎లో పలు పోస్టులు చేశారు. 

‘‘పాకిస్తాన్​కు అర్థమయ్యే భాషలో గుణపాఠం నేర్పించాల్సిన సమయం ఇది. పాక్ ఆక్రమిత కాశ్మీర్(పీఓకే)ను తిరిగి స్వాధీనం చేసుకునే సమయం ఆసన్నమైంది” అని తన పోస్టులో పేర్కొన్నారు. ‘‘కొన్ని రోజులుగా తాను మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కేంద్రంలో అధికారంలో ఉన్నవారి తీరును నిశితంగా గమనిస్తున్నాను. పహల్గామ్​లో టెర్రరిస్టుల దాడికి దారితీసిన లోపాలను లోతుగా దర్యాప్తు చేయడానికి బదులుగా, వారు ఒక నిర్దిష్ట రాజకీయ పార్టీకి ప్రయోజనం చేకూర్చే కథనాలను  ముందుకు తీసుకెళ్లడంపై ఎక్కువ ఫోకస్ పెట్టినట్టు అనిపిస్తున్నది’’ అని అన్నారు.