రాహుల్ హత్యకు బీజేపీ నేతల కుట్ర : పోలీసులకు కాంగ్రెస్​ ఎంపీ అజయ్ మాకెన్ ఫిర్యాదు

రాహుల్ హత్యకు బీజేపీ నేతల కుట్ర : పోలీసులకు కాంగ్రెస్​ ఎంపీ అజయ్ మాకెన్ ఫిర్యాదు
  • ప్రశ్నిస్తున్నందుకే రాహుల్​పై విద్వేషపూరిత కామెంట్లు
  • దేశంలో అశాంతి నెలకొనేలా బీజేపీ నేతల చర్యలు
  • రాహుల్ నాలుక కోస్తే రివార్డు ఇస్తామనడం ఏంటి?
  • వెంటనే చర్యలు తీసుకోవాలని కంప్లైంట్

న్యూఢిల్లీ: లోక్‌‌‌‌‌‌‌‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై అనుచిత కామెంట్లు చేసిన అధికార ఎన్డీఏ కూటమి నేతలపై కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ అజయ్ మాకెన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బుధవారం ఢిల్లీలోని తుగ్లక్ రోడ్ పోలీస్ స్టేషన్‌‌‌‌‌‌‌‌కు వెళ్లిన ఆయన..రాహుల్ గాంధీ హత్యకు ఎన్డీఏ కుట్ర చేస్తున్నదని పేర్కొంటూ కంప్లయింట్ ఇచ్చారు. "దేశంలోని పేదలు, దళితులు, మహిళలు, విద్యార్థుల సమస్యలపై  కేంద్రాన్ని రాహుల్ ప్రశ్నిస్తున్నారు. వారి సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. ఇది బీజేపీకి, దాని మిత్రపక్ష పార్టీలకు నచ్చడం లేదు. 

అందుకే ఎన్డీఏ కూటమి నేతలు రాహుల్ పై విద్వేషపూరిత కామెంట్లు చేస్తున్నారు. ప్రజల్లో అశాంతి నెలకొనేలా కుట్ర పన్నుతున్నారు. అందులో భాగంగానే ఢిల్లీలో రాహుల్ పై దాడి చేస్తామని బీజేపీ నేత తర్వీందర్ సింగ్ మార్వా  ఈ నెల 11న కామెంట్ చేశారు. రాహుల్ దేశంలోనే నంబర్ వన్ టెర్రరిస్ట్ అని ఈ నెల 15న రైల్వే శాఖ సహాయ మంత్రి రవ్‌‌‌‌‌‌‌‌నీత్ సింగ్ బిట్టు పేర్కొన్నారు. 16న బీజేపీ నేత, ఉత్తరప్రదేశ్ మంత్రి రఘురాజ్ సింగ్ కూడా రాహుల్​ను దేశంలో నంబర్ వన్ టెర్రరిస్ట్ అని బహిరంగంగా సంబోధించారు. 

అదే రోజు మహారాష్ట్రలోని బుల్తానా నియోజకవర్గ శివసేన(షిండే వర్గం) ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్..రాహుల్ గాంధీ నాలుకను కోసేసిన వారికి రూ.11లక్షల రివార్డు ఇస్తానంటూ  ప్రకటించారు. జమ్మూకాశ్మీర్, హర్యానాలో అసెంబ్లీ ఎన్నికల వేళ ఇలాంటి కామెంట్లు రాహుల్ గాంధీ భద్రతను దెబ్బతీయవచ్చు. తద్వారా ప్రజా శాంతికి విఘాతం కలగవచ్చు. అందుకే ఈ నలుగురిపై బీఎన్ఎస్ సెక్షన్లు 351, 352, 353, 61 కింద ఎఫ్‌‌‌‌‌‌‌‌ఐఆర్ నమోదు చేయండి" అని అజయ్ మాకెన్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో  అభ్యర్థించారు.