ఓట్లు చీల్చేందుకే కుల రాజకీయాలు : ధర్మపురి అర్వింద్

  •     మహిళా లోకానికి కవిత ఓ నల్ల మచ్చ 
  •      ఎంపీ, కోరుట్ల బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ ఫైర్​

మెట్ పల్లి, వెలుగు : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పైసల పిశాచిగా మారిందని ఎంపీ, కోరుట్ల బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ విమర్శించారు. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఎవరైనా బిజినెస్​చేయాలన్నా, ఫ్యాక్టరీ పెట్టాలన్నా పార్టనర్ షిప్ డిమాండ్​చేయడంతోపాటు, ముడుపులు తీసుకుంటున్నారని ఆరోపించారు. సోమవారం ఆయన మెట్ పల్లిలో ఎన్నికల ప్రచారం చేశారు. కొత్త బస్టాండ్, పాత బస్టాండ్ మీదుగా వ్యవసాయ మార్కెట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.

శాస్త్రి చౌరస్తా వద్ద మాట్లాడుతూ.. కవిత లిక్కర్ దందా చేసి రాష్ట్ర మహిళల పేరు చెడగొట్టిందన్నారు. తెలంగాణ మహిళా లోకానికి  కవిత నల్ల మచ్చగా మారిందని విమర్శించారు. హిందువుల ఓట్లు చీల్చడానికి బీఆర్ఎస్ లీడర్లు కుల రాజకీయాలు చేస్తున్నారని, వాళ్ల ఉచ్చులో పడొద్దని సూచించారు. కేంద్రంలో బీజేపీ పాలన ఎంత అవసరమో, రాష్ట్రంలోనూ అంతే అవసరం అన్నారు. పీఎఫ్ఐ వంటి ఉగ్రవాద సంస్థల యాక్టివిటీస్ జగిత్యాల, నిజామాబాద్​లో ఎలా పెరిగాయో ఆలోచించాలన్నారు.

సీఎం కేసీఆర్ ఓ వర్గానికి వత్తాసు పలుకుతూ రాష్ట్ర భద్రతను పణంగా పెడుతున్నారని ఆరోపించారు. బోధన్ లో 200 మంది రోహింగ్యాలకు పాస్ పోర్టులు జారీ చేయడమే ఇందుకు నిదర్శనం అన్నారు. దశాబ్దాలుగా పాలిస్తున్న దొరలను గద్దె దించడానికే  కోరుట్ల నుంచి  పోటీ చేస్తున్నానని చెప్పారు. బీజేపీని గెలిపిస్తే, గల్ఫ్ కార్మికుల కోసం ప్రత్యేక గల్ఫ్ మినిస్ట్రీ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. తనను గెలిపిస్తే నిజాం షుగర్ ఫ్యాక్టరీలను రీఓపెన్ చేసి, పసుపు పంటకు రు.12 వేలు ధర కల్పిస్తామని హామీ ఇచ్చారు.

స్థానిక ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీలోనూ కమీషన్లు తీసుకుంటున్నారని ఆరోపించారు. చెరుకు రైతులు నామినేషన్ వేస్తామని చెప్పడం కరెక్ట్​కాదని, అలా చేస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలి బీఆర్ఎస్ కే లాభం జరుగుతుందన్నారు. ఖాదీ బోర్డును పూర్తిగా ప్రక్షాళన చేసి అవినీతి లేకుండా చేస్తామని చెప్పారు. ఆయన వెంట జిల్లా బీజేపీ అధ్యక్షుడు మొరేపల్లి సత్యనారాయణ, నాయకులు డాక్టర్ రఘు, ఆకుల లింగారెడ్డి, టౌన్ ప్రెసిడెంట్ బోడ్ల రమేశ్, సుఖేందర్ గౌడ్, దోనికెల నవీన్, నరేందర్ రెడ్డి, సురభి నవీన్ తదితరులు పాల్గొన్నారు.