- ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై ఎంపీ అనిల్ కుమార్ ఫైర్
హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్‌లో ఉంటూ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే చూస్తూ ఊరుకోబోమని, సరైన సమయంలో చర్యలు తప్పవని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్‌తో పాటు బీసీ సామాజిక వర్గానికి చెందిన ఆరుగురు కార్పొరేషన్ చైర్మన్లు హెచ్చరించారు. బుధవారం గాంధీ భవన్‌లో అనిల్‌కుమార్‌తో పాటు కార్పొరేషన్ చైర్మన్లు ఈరవత్రి అనిల్, మెట్టు సాయి, కాసుల బాల్ రాజ్, జల్లిపేట జైపాల్, బోర జ్ఞానేశ్వర్, నాయుడు సత్యనారాయణ మాట్లాడారు. తామంతా ఓటు వేస్తేనే మల్లన్న ఎమ్మెల్సీ అయ్యాడన్న విషయం గుర్తుపెట్టుకోవాలన్నారు.
తాము కూడా బీసీలమేనని, బీసీలకు న్యాయం జరగాలనే తపన తమకూ ఉంటుందని చెప్పారు. ఇంట గెలిచి రచ్చ గెలవాలని మల్లన్నకు సూచించారు. కాంగ్రెస్ పార్టీ బీసీల కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని, తమలాంటి బీసీలకు కార్పొరేషన్ చైర్మన్ పదవులను ఇచ్చిందని గుర్తుచేశారు. మల్లన్న తీరు తల్లిపాలు తాగి రొమ్ము గుద్దే రకంగా ఉందని మండిపడ్డారు. బీసీ సీఎం కావాలని తమకూ ఉందని.. అయితే దానికి సమయం, సందర్భం ఉంటుందని చెప్పారు. రాష్ట్రంలో సీఎం రేవంత్ బీసీల సంక్షేమం కోసం పాటుపడుతున్నారని, దేశంలో రాహుల్ గాంధీ కుల గణనతో బీసీలకు న్యాయం చేసే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు.