ఖమ్మంలో బీఆర్ఎస్ నిర్వహించిన భారీ బహిరంగ సభ అట్టర్ ఫ్లాప్ అయిందని బీజేపీ నేత, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. లిక్కర్ స్కామ్ తో పాటు ఇతర కుంభకోణాల్లో నిందితులుగా ఉన్న వారంతా స్టేజి మీద ఉన్నారని విమర్శించారు. దేశవ్యాప్తంగా ఉచిత కరెంట్ ఇస్తామంటున్న కేసీఆర్ ముందు ఏసీడీ చార్జీల మీద రాష్ట్ర ప్రజలకు సీఎం క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రతి నియోజకవర్గంలో 100 మందికి దళితబంధు ఇచ్చామని కేసీఆర్ చెబుతున్నారని ఆ లెక్కన చూస్తే రాష్ట్రంలో కేవలం 10 వేల మంది మాత్రమే పథకం ద్వారా లబ్ది పొందారన్న విషయం స్పష్టమవుతోందని అర్వింద్ అన్నారు.
రాష్ట్రంలో 16 లక్షల మంది దళితులున్నారని గతంలో చెప్పిన కేసీఆర్.. అందరికి ఎందుకు దళితబంధు ఇవ్వడంలేదని ప్రశ్నించారు. వాసాలమర్రి గ్రామాన్ని దత్తత తీసుకుని గాలికి వదిలేసిన సీఎం.. బీఆర్ఎస్ పేరుతో దేశమంతా పిచ్చిపట్టినట్లు తిరుగుతున్నాడని సటైర్ వేశారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ఖాళీ అవుతుందని, బీజేపీ అధికారం చేపడుతుందని అర్వింద్ ధీమా వ్యక్తం చేశారు.