- కమ్యూనిస్టులు.. కేసీఆర్‌కు బౌన్సర్లు
- కేంద్రం ఇచ్చిన రూ.10వేల కోట్లను కాళేశ్వరంలో పోసిన్రు
- నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్
చౌటుప్పల్, వెలుగు : కమ్యూనిస్టు లీడర్లు మంచివాళ్లే.. కానీ వాళ్లు ఇప్పుడు కేసీఆర్‌కు బౌన్సర్లుగా వ్యవహరిస్తున్నారని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. యాదాద్రి జిల్లా చౌటుప్పల్‌లో బుధవారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దొరలు, భూస్వాములకు వ్యతిరేకంగా కొట్లాడిన లెఫ్ట్ పార్టీలు ఇప్పుడు కేసీఆర్‌కు ఎందుకు సపోర్ట్ చేస్తున్నాయని పాత తరం కమ్యూనిస్టులు అడుగుతున్నారన్నారు. ‘కేసీఆర్ పేదలకు భూములు ఇస్తానని మోసం చేశాడు, డబుల్ ఇండ్లు ఇవ్వలేదు..అందుకే సపోర్ట్ చేస్తున్నారా’ అని ప్రశ్నించారు. తెలంగాణ సర్కార్‌కు ఘోరీ కట్టేందుకే రాజగోపాల్‌రెడ్డి రాజీనామా చేశారన్నారు. ఇంటి నిర్మాణానికి, ఆరోగ్య బీమాకు ప్రధాని మోడీ ఇస్తున్న నిధులను కేసీఆర్ పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. లా అండ్ ఆర్డర్‌ను చేతుల్లో పెట్టుకొని రజాకార్ల మాదిరిగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్వ శిక్ష అభియాన్, సమగ్ర శిక్ష అభియాన్ కింద కేంద్రం రూ.10 వేల కోట్లు ఇస్తే వాటన్నింటిని కాళేశ్వరంలో పోశారన్నారు.
దత్తత తీసుకున్న గ్రామాల్లో అభివృద్ధి చేశారా ?
చండూరు: మునుగోడును దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తానని చెప్పిన కేటీఆర్ ఇంతకుముందు దత్తత తీసుకున్న ఏ ఊర్లను అభివృద్ధి చేశారో చెప్పాలని అర్వింద్ ప్రశ్నించారు. గట్టుపల్ మండలంలో ముఖ్య కార్యకర్తల మీటింగ్ లో ఆయన మాట్లాడుతూ మునుగోడును దత్తత తీసుకున్న కొడుకు..రాష్ట్రాన్ని దత్తత తీసుకున్న తండ్రి.. సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ లో తప్పా ఎక్కడా అభివృద్ధి చేయలేదన్నారు. అక్కడ కేటాయించిన నిధుల్లో సగమైనా మునుగోడులో కేటాయించాలంటూ అసెంబ్లీలో ఎన్నోసార్లు రాజగోపాల్ రెడ్డి అడిగినా సీఎం పట్టించుకోలేదన్నారు. మునుగోడులో ఎన్ని డబుల్ ఇండ్లు కట్టారో తండ్రీ, కొడుకులు చూపించాలని సవాల్ విసిరారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు కంకణాల శ్రీధర్ రెడ్డి, ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ ప్రభాకర్, మాజీ సర్పంచ్ నామనిజగన్నాథం, రాపోలుగోపీనాథ్, గంజి కృష్ణయ్య, రవితేజ పాల్గొన్నారు.