సీఎం కేసీఆర్ కు మనసే లేదని నిజమాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ మండిపడ్డారు. అకాల వర్షాలతో పంట నష్టపోయామని రైతులు రోడ్డెక్కుతుంటే.. సీఎం కేసీఆర్ ఏం పట్టనట్టు ఉంటున్నారని ఆరోపించారు. భారీ వర్షాలకు పంటంతా కొట్టుకుపోయి.. వడ్లు మొలకెత్తుతుంటే రైతుల గోస సీఎం కేసీఆర్ కు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి 10 వేలు ఇస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చిన మాట ఎప్పుడు నిలబెట్టుకుంటారని నిలదీశారు. కేటీఆర్ ట్విట్టర్ లో చేస్తున్న విమర్శలు మానుకోవాలని సూచించారు. తండ్రి, కొడుకులు ఇద్దరు వడ్డు కొనుగోలు చేయకుండా ఏం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అకాల వర్షానికి ఓవైపు వర్షానికి తడిసిన వడ్లతో రైతులు బాధ పడుతుంటే.. తరుగు పేరుతో రైతులను ప్రభుత్వం దోపిడీ చేస్తుందని విమర్శించారు.
జగిత్యాల జిల్లా లక్ష్మీపూర్ లో రైతు ఉత్పత్తి దారుల కంపెనీని ఎంపీ ధర్మపురి అరవింద్ ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం, నాబార్డ్ సంఘ సభ్యుల సహకారంతో గోదామును ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ప్రపంచం ఆర్గానిక్ వైపు చూస్తుందని.. రైతులు మందులను కొట్టడంపై అవగాహన పెంచుకోవాలని ధర్మపురి అరవింద్ కోరారు. లక్ష్మీపూర్ ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీని ఆదర్శంగా తీసుకొని మరిన్ని సంఘాలు ముందుకు రావాలని రైతులకు ఆయన పిలుపునిచ్చారు.