గెలిచిన ఎమ్మెల్యేలను కాపాడుకునే సత్తా రేవంత్​కు ఉందా? : ఎంపీ అర్వింద్

వర్ధన్నపేట, వెలుగు: రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో  కాంగ్రెస్  తరపున గెలిచే ఎమ్మెల్యేలను కాపాడుకునే సత్తా రేవంత్ రెడ్డి ఉందా అని బీజేపీ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ప్రశ్నించారు. గత ఎన్నికల్లో చేతి గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలు గంపగుత్తగా కారెక్కిన విషయం రేవంత్ కు గుర్తు లేదా అని నిలదీశారు.  ప్రధాని నరేంద్రమోదీ వరంగల్ జిల్లా పర్యటన నేపథ్యంలో  వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామంలో శుక్రవారం ఎంపీ అర్వింద్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వరంగల్ ఉమ్మడి జిల్లా సమగ్రాభివృద్ధికి మోదీ సర్కారు ప్రాధాన్యమిస్తున్నదన్నారు. 

రూ.600 కోట్ల ఖర్చుతో చేపట్టిన అభివృద్ధి పనులు చూసి సీఎం కేసీఆర్ లో అభద్రతాభావం పెరిగిపోతున్నదని ఎద్దేవా చేశారు. అందుకే వరంగల్ జిల్లాలో కేంద్రం చేయూతతో  ఏర్పాటు కాబోతున్న అంతర్జాతీయ స్థాయి టెక్స్ టైల్ పార్క్ కు ఇప్పటివరకు కేసీఆర్ సర్కార్ ఎంవోయూ చేసుకోలేదని మండిపడ్డారు. బీఆర్ఎస్, కాంగ్రెస్  రెండూ ఒక్కటే అన్న విషయం ప్రజలు కూడా గ్రహించారని, అందుకే వచ్చే ఎలక్షన్లలో తెలంగాణ గడ్డపై కాషాయం జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.