జగిత్యాల : రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు మళ్లీ బీఆర్ఎస్ కు అమ్ముడుపోతారని నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ వ్యాఖ్యానించారు. అందుకే కాంగ్రెస్ పార్టీను లేపాలని కేసీఆర్ చూస్తున్నారని, ఈసారి రేవంత్ రెడ్డితో సహా100 శాతం బీఆర్ఎస్ లోకి చేరిపోతారని చెప్పారు. 125 ఏళ్లుగా లేవని కాంగ్రెస్ ఇప్పుడు లేవదన్నారు. కేసీఆర్ ఫ్రెండ్ షిప్ బీజేపీకి అసలే వద్దన్నారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందని, వాతావరణం మాదిరిగానే రాజకీయ పార్టీల పరిస్థితి కూడా మారుతుంటుందని చెప్పారు.
తమకు కాంగ్రెస్ ను పడేసేందుకు కొద్ది సమయం చాలన్నారు ఎంపీ అర్వింద్. నరేంద్ర మోడీ నాయకత్వంలో తెలంగాణలో బీజేపీ సర్కారు ఏర్పడబోతోందని చెప్పారు. కోరుట్లలో బీజేపీ భారీ మెజార్టీతో గెలిచి తీరుతుందన్నారు. కోరుట్ల కాంగ్రెస్ నేతలు తనకు ఫోన్ చేసి, బీజేపీలోకి వస్తామని అడుగుతున్నారని, ఇప్పటికే తమ దగ్గర హౌస్ ఫుల్ అయ్యిందన్నారు. కోరుట్లలో బీజేపీ మహాజన్ సంపర్క్ అభియాన్ లో ఎంపీ అర్వింద్ ఈ కామెంట్స్ చేశారు.
వర్షాలు లేక వరినార్లు ఎండిపోతుంటే.. కాళేశ్వరం నుంచి నీళ్లు మాత్రం రావడం లేదన్నారు. గోదావరి నుంచి రివర్స్ పంపింగ్ తో ఎస్సారెస్పీకి నీరు తెచ్చేందుకు సీఎం కేసీఆర్ వెయ్యికోట్లు ఖర్చు చేశారట అంటూ మండిపడ్డారు. ఒకవేళ నీరు తెచ్చేందుకు ప్రయత్నిస్తే.. వరినార్లు ఎందుకు ఎండిపోతున్నాయని ప్రశ్నించారు. బీడీ కార్మికులు పీఎఫ్ తీసుకునే విషయంలో ఇబ్బందులు పడుతున్నారని, అలాంటి వారికోసం ఆధార్ లో దొర్లిన తప్పులను సవరించే ప్రక్రియ చేపట్టామన్నారు. ధాన్యం కొనుగోలు కోసం కేంద్రమే అన్ని ఖర్చులు భరిస్తున్నా.. సమయానికి సెంటర్లు ఏర్పాటు చేయకపోవడంతో రైతులు నష్టపోతున్నారని చెప్పారు. రైతుల దగ్గర తడిచిన ధాన్యాన్ని కోతలు పెట్టి కొన్నారని తెలిపారు.
ఈ ఏడాది చివరి వరకు భవ్య రామమందిరం నిర్మాణం పూర్తవుతుందని చెప్పారు. ఇతర దేశాల్లో మత పీడనకు గురవుతున్న భారతీయులకు న్యాయం చేసేందుకు మోడీ అన్ని చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. మోడీ నాయకత్వంలో కమలం వికసిస్తోందన్నారు. ఎంత కొట్లాడినా.. ఎంత ప్రచారం చేసినా డబ్బు రాజకీయాలు ఎక్కువయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. వీటన్నింటిని ఎదుర్కోవాలంటే కార్యకర్తలు, ప్రజల ఆశీర్వాదం ముఖ్యమన్నారు. తొమ్మిదేళ్ల మోడీ పాలనలో అమలు చేసిన పథకాలన్నీ ప్రజల్లోకి తీసుకెళ్లేందుకే బీజేపీ మహాజన్ సంపర్క్ అభియాన్ కార్యక్రమం చేపట్టామన్నారు. గుజరాత్ లో లక్షకు పైగా చెక్ డ్యామ్ లు నిర్మించిన ఘనత మోడీదే అన్నారు. అంధకారంలో ఉన్న గుజరాత్ కు త్రీఫేజ్ కరెంట్ తెచ్చిన ఘనత ఆయనదే అన్నారు. తొమ్మిది వేల కోట్లున్న రైతుల ఆదాయాన్ని మోడీ రూ.30 వేల కోట్లకు తెచ్చారని చెప్పారు.