నిజామాబాద్ టెర్రరిస్టులకు అడ్డాగా మారిందన్న అర్వింద్

నిజామాబాద్ జిల్లా టెర్రరిస్టులకు అడ్డాగా మారిందని ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. ఈ విషయాన్ని పార్లమెంటులోనూ ప్రస్తావించినట్లు చెప్పారు. ఏడాదిన్నర క్రితం బోధన్ లో బయటపడ్డ దొంగ పాస్ పోర్ట్ ఇష్యూలో టీఆర్ఎస్, ఎంఐఎం ఎమ్మెల్యేల పాత్ర ఉందని అర్వింద్ ఆరోపించారు. ఈ అంశంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా, డీజీపీ మహేందర్ రెడ్డికి ఫిర్యాదుచేసినట్లు చెప్పారు. ఫేక్ పాస్ పోర్టు వ్యవహారాన్ని ఎన్ఐఏ దర్యాప్తునకు అప్పగించాలని కోరారు

బీఆర్ఎస్లో కవిత యాక్టివ్గా ఉండాలె

టీఆర్ఎస్ పార్టీ పేరును బీఆర్ఎస్గా మార్చడంతో పాటు ఇండియా మ్యాపును మార్చిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందని అర్వింద్ సటైర్ వేశారు. కేసీఆర్ బతికున్నంత వరకు అది నేషనల్ పార్టీ కాదని అన్నారు. రాష్ట్ర సమస్యలు పరిష్కరించని ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పేరుతో జాతీయపార్టీ పెట్టడమేంటని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ఆవిర్భావ సమయంలో ఇందూరుకు ప్రాధాన్యమివ్వలేదన్న ఆయన.. సిట్టింగ్ ఎమ్మెల్సీ కవితను ఎందుకు ఆహ్వానించలేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్లో కవిత క్రియాశీలంగా ఉండాలని కోరుకుంటున్నట్లు అర్వింద్ చెప్పారు.

పసుపు శుద్ధి కర్మాగారం ఏమైంది?

డబుల్ ఇంజిన్ సర్కారు వల్లే న్యాయం జరుగుతుందని, పసుపు రైతులు భావిస్తున్నారని, అందుకే వారితో పాటు రైతు ప్రతినిధులు బీజేపీలో చేరుతున్నారని అర్వింద్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపితే పసుపు రైతులకు డబ్బులిస్తామని కేంద్రం చెప్పినా కేసీఆర్ మాత్రం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. జిల్లాలో పసుపు శుద్ధి కర్మాగారం ఏర్పాటు చేస్తామని కేసీఆర్ ఇచ్చిన హామీ ఏమైందని అర్వింద్ ప్రశ్నించారు. 

ముందస్తు రాకపోవచ్చు

మునుగోడులో గెలిచేది బీజేపీ పార్టీయే అని అర్వింద్ ధీమా వ్యక్తం చేశారు. కాంట్రాక్టుల కోసమే రాజగోపాల్ పార్టీ మారారంటూ చేస్తున్న ప్రచారంపై ఆయన స్పందించారు. రాజగోపాల్ 20 ఏండ్ల కిందటే కాంట్రాక్టర్ అని, కానీ కేసీఆర్ మాత్రం అప్పట్లో పాస్పోర్ట్ బ్రోకర్గా పనిచేసేవాడని చెప్పారు. రేవంత్ రెడ్డి ప్రసంగాలు వింటే గులాబీ శాలువా కప్పుకున్నట్లు అనిపిస్తోందని అర్వింద్ చురకలంటించారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వస్తాయని అనుకోవడం లేదన్న ఆయన.. పార్టీ నిర్ణయం మేరకే పోటీ చేస్తానని స్పష్టం చేశారు.