ప్రజల ముంగిట్లో కేంద్ర పథకాలు .. వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో ఎంపీ అర్వింద్​

మోపాల్, వెలుగు: పల్లెల అభివృద్ధి, పేద ప్రజల సంక్షేమ కోసం కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ పేర్కొన్నారు. సోమవారం మోపాల్ ​మండలం సిర్పూర్ లో సాగిన వికసిత్​భారత్​ సంకల్ప్ ​యాత్రలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. కేంద్ర పథకాలపై ప్రజలకు  అవగాహన కల్పించడంతో పాటు వాటిని ప్రతిఒక్కరు సద్వినియోగం చేసుకోవాలన్న ఉద్ధేశంతో కేంద్రం గ్రామగ్రామాన వికసిత్ భారత్ సంకల్ప యాత్రను నిర్వహిస్తోందన్నారు. 

కులమతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు అభివృద్ధి చెందాలన్నదే ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యమన్నారు. సంకల్ప యాత్ర ద్వారా గ్రామాలకు వచ్చే అధికారులకు ఆయా పథకాలకు సంబంధించి అప్లికేషన్లు సమర్పించవచ్చని సూచించారు. కేంద్ర పథకాల వివరాలతో రూపొందించిన క్యాలెండర్ ను ఎంపీ ఆవిష్కరించారు. స్థానికులతో సంకల్ప ప్రతిజ్ఞ చేయించారు. క్యాలెండర్ పై ఉన్న క్యూఆర్ కోడ్ ను స్కాన్​ చేస్తే కేంద్రం అమలు చేసే సంక్షేమ పథకాల వివరాలు తెలుస్తాయన్నారు. ఈ సదుపాయాన్ని ప్రతిఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ సామ ముత్యం, ఏపీడీ సంజీవ్ కుమార్, ఏవో రవీందర్, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.