జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ బోగ శ్రావణి ఆత్మాభిమానం కోసం రాజీనామా చేసిందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఇబ్బందులకు గురి చేస్తున్నాడంటూ ఇటీవల తన ఛైర్ పర్సన్ పదవికి శ్రావణి రాజీనామా చేసింది. ఈ క్రమంలో ఎంపీ అర్వింద్ ఆమెను పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రజా సమస్యలను పరిష్కరించినందుకు శ్రావణిని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కించపరిచాడని మండిపడ్డారు. గతంలో రాయికల్ మాజీ ఎంపీపీ పడాల తిరుపతిపై కూడా వ్యక్తిగత ఆరోపణలు చేసిండని.. అర్వింద్ గుర్తుచేశారు.
జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కు సైకియాట్రిక్ ట్రీట్మెంట్ అవసరమని ఎంపీ అర్వింద్ సూచించారు. శ్రావణి బీజేపీ పార్టీ కానప్పటికీ తమ పార్లమెంట్ బిడ్డ పరామర్శించామని ఆయన చెప్పారు. బీఆర్ఎస్ నేతల అహంకారాన్ని పాతాళానికి తొక్కే సమయం ముందుందన్నారు. తమ పూర్తి మద్దతు ఇస్తామని.. రాజకీయాలకు అతీతంగా పోరాడుతామని శ్రావణికి భరోసా ఇచ్చారు. తన ఎన్నికల్లో టీఆరెస్ జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు పని చేశారని.. అందుకే ఒక సోదరుడిగా శ్రావణిని కలిశానని వెల్లడించారు.