కాంగ్రెస్ హయాంలోనే షుగర్ ఫ్యాక్టరీలు మూతపడ్డాయ్​ : ఎంపీ అర్వింద్

జగిత్యాల/ కోరుట్ల/మెట్ పల్లి, వెలుగు: ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ మూతపడేందుకు కారణమైన కాంగ్రెస్.. ఇప్పుడు కమిటీల పేరిట కాలయాపన చేస్తోందని, రాష్ట్ర సర్కార్ కేంద్రానికి సహకరిస్తే ఫ్యాక్టరీని తెరిపించేందుకు తాను కృషి చేస్తానని ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. సోమవారం జగిత్యాల జిల్లాలోని జగిత్యాల, కోరుట్ల నియోజకవర్గాల్లో నిర్వహించిన బీజేపీ విజయ సంకల్ప యాత్రలో ఆయన పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ ఇచ్చిన 6 హామీలకు గ్యారంటీ లేదని, మహిళలకు ఉచిత బస్సు పథకం కింద కొత్త బస్సులు ఏర్పాటు చేయలేదని విమర్శించారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో 400 ఎంపీ సీట్ల తో ప్రధానిగా మళ్లీ మోదీనే గెలవడం ఖాయమన్నారు.

నిజామాబాద్‌లో పసుపు బోర్డును తొందరలోనే ఏర్పాటు చేస్తామని, పసుపు రైతులకు క్వింటాళ్‌కు మద్దతు ధర రూ.20 వేలు దాటడం ఖాయమన్నారు. మామిడి రైతులను ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఏమాత్రం పట్టించుకోలేదన్నారు. రాజ్యాంగంలో సెక్యులర్ పదాన్ని తొలగించాలని, దేశాన్ని హిందూ దేశంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. దేశంలో ఎన్ఆర్‌‌సీ, యూనిఫాం సివిల్ కోడ్ అమలు చేయాలని కోరారు. కాంగ్రెస్ కు ఓటేస్తే వృథా అవుతుందన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ రావు, సురభి నవీన్ కుమార్, బీజేపీ నేతలు పాల్గొన్నారు.