నిజామాబాద్, వెలుగు: కాంగ్రెస్ గవర్నమెంట్‌ను ఇబ్బందిపెట్టే ఆలోచన తమకు లేదని ఎంపీ అర్వింద్ తెలిపారు. ఎలక్షన్ టైంలో ఆ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలును గమనిస్తూ ఉంటామని చెప్పారు. ప్రధాని మోదీని సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కలువడం హర్షణీయం అన్నారు. మంగళవారం ఆయన నగరంలోని బీజేపీ జిల్లా ఆఫీస్‌లో మీడియాతో మాట్లాడారు.
నిజామాబాద్, మహబూబ్‌నగర్ లోక్‌సభ స్థానం నుంచి ప్రధాని మోదీ పోటీ చేయనున్నారనే ప్రచారంపై ఎంపీ స్పందిస్తూ .. నిజామాబాద్ నుంచి పోటీ చేస్తే అంతకు మించిన సంతోషం తమకు ఉండదన్నారు. పాదయాత్ర చేసి ఆయన్ను గెలిపిస్తామన్నారు. పార్టీ ఆదేశాలతో కోరుట్ల అసెంబ్లీ స్థానంలో పోటీ చేశానన్నారు. ఓటర్లను ప్రలోభపెట్టే డబ్బు ఖర్చును రాజకీయాల నుంచి దూరం చేయాల్సిన అవసరం ఉందని, అందుకే కోరుట్లలో తాను అదే చేశానన్నారు.
ఐదేండ్ల తన ఎంపీ పదవిలో ఒక్క అవినీతి ఆరోపణ కూడా ఎదుర్కోలేదన్నారు. పసుపు బోర్టు ఏర్పాటు పనులు వేగంగా జరుగుతున్నాయని, పసుపు క్వింటాల్‌కు రూ.20 వేల రేటు ఇప్పించడం తన టార్గెట్ అన్నారు. కార్పొరేషన్ ఎన్నికలెప్పుడు జరిగినా బీజేపీ గెలుపు ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, జిల్లా అధ్యక్షుడు బస్వాలక్ష్మీనర్సయ్య, రాష్ట్ర కార్యదర్శి పల్లె గంగారెడ్డి ఉన్నారు.
కేంద్ర పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
నందిపేట: అన్ని వర్గాల ప్రజలకు అభివృద్ధి సంక్షేమ పథకాలు అందాలన్నదే ప్రధాని మోదీ లక్ష్యమని ఎంపీ ధర్మపురి అర్వింద్ పేర్కొన్నారు. మండలంలోని కుద్వాన్పూర్ లో ‘వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర ’ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు కిసాన్‌సమ్మాన్ నిధి, ముద్ర రుణాలు, ఆయుష్మాన్భారత్, ఉజ్వల యోజన పేదప్రజలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి పల్లె గంగారెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ పాలెపు రాజు, స్వచ్ఛ భారత్ జిల్లా చైర్మన్ వీరేశం పాల్గొన్నారు.