కేజ్రీవాల్‌‌‌‌‌‌‌‌కు నోటీసులు రాగానే కవిత కన్పించట్లే: ఎంపీ అర్వింద్‌

మెట్‌‌‌‌‌‌‌‌పల్లి, వెలుగు: లిక్కర్ స్కాంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌‌‌‌‌‌‌‌కు నోటీసులు వచ్చినప్పటి నుంచి నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్‌‌‌‌‌‌‌‌లో ఎమ్మెల్సీ కవిత మాయమైందని కోరుట్ల బీజేపీ అభ్యర్థి, ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. ఆదివారం బీజేపీ పట్టణ బూత్, శక్తి కేంద్ర స్వశక్తి అభియాన్‌‌‌‌‌‌‌‌లో భాగంగా జగిత్యాల జిల్లా మెట్‌‌‌‌‌‌‌‌పల్లిలో బూత్, శక్తి కేంద్ర ఇన్‌‌‌‌‌‌‌‌చార్జిలతో ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. 

ఈ సందర్భంగా పార్టీ శ్రేణులకు అర్వింద్ దిశానిర్దేశం చేశారు. నియోజకవర్గంలో తాను కనిపించడం లేదని కొందరు అంటున్నారని, ప్రజల ఆశీస్సులతో సీఎం కేసీఆర్ కుటుంబాన్ని ఓడించి వారిని కనబడకుండా చేస్తానన్నారు. కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను మించిన పచ్చి మోసగాడు రేవంత్ రెడ్డి అని, ఆయన పార్టీకి అధికారమిస్తే తెలంగాణలో అత్యంత భయంకర పరిస్థితులు వస్తాయన్నారు. 

రాష్ట్రంలో కొన్ని మీడియా చానళ్లతో కుమ్మక్కైన సీఎం కేసీఆర్ కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌కు హైప్ క్రియేట్ చేస్తున్నారని మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌కు 40లోపు సీట్లు రావడం కూడా అసంభవం అన్నారు. ఈ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు బీజేపీకే వస్తాయని, లేకపోతే హంగ్ ఏర్పడుతుందని చెప్పారు. అయితే, సర్కారును మాత్రం తామే ఏర్పాటు చేస్తామని తెలిపారు. కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అధికారమిస్తే మేడిగడ్డ ప్రాజెక్టు కొన్ని పిల్లర్లకు క్రాక్స్ వచ్చాయని, కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌కు అధికారం ఇస్తే ఉన్న పిల్లర్లు కూడా మునిగిపోతాయన్నారు. 

తెలంగాణపై మోదీ ప్రత్యేక దృష్టి..

తెలంగాణలో బీజేపీ సర్కారు ఏర్పాటుకు ప్రధాని మోదీ కంకణం కట్టుకున్నారని, అందులో భాగంగానే రాష్ట్రంపై ప్రత్యేక దృష్టి సారించారని అర్వింద్‌‌‌‌‌‌‌‌ అన్నారు. బీజేపీ అధికారంలోకి రాగానే గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి ప్రత్యేక మినిస్ట్రీ ఏర్పాటు చేసి, వారి సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. సోమవారం మెట్‌‌‌‌‌‌‌‌పల్లిలో బీజేపీ ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తున్నామని వెల్లడించారు. 

ఇక్కడి నుంచే కాషాయ ప్రభంజనం షురూ చేసి, నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో బీజేపీ జెండా ఎగరేస్తామన్నారు. ఇక్కడ చేపట్టే రోడ్ షోలో సీఎం కేసీఆర్, రేవంత్ మధ్య ఉన్న సంబంధాలను బయటపెడతానని తెలిపారు.