పోలీసులకు వీక్ ఆఫ్ లేదు, పీఆర్సీ లేదని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. డబుల్ బెడ్ రూం ఇండ్ల పేరుతో టీఆర్ఎస్ ప్రభుత్వం పేదలను మోసం చేసిందని ఆయన అన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా ఆయన హస్తినాపురంలోని 16వ డివిజన్ బీజేపీ అభ్యర్థి బోనోత్ సుజాత తరపున ప్రచారం నిర్వహించారు. ఈ రోడ్ షోకి బీజేపీ నేతలు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘వరద బాధితులను కేసీఆర్ సర్కార్ మోసం చేసింది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ నాయకుల నుంచి డబ్బులు తీసుకోని.. బీజేపీ పార్టీకి ఓటు వేయండి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధుల నుంచే టీఆర్ఎస్ ప్రభుత్వం వరద బాధితులకు రూ. 10 వేల సాయం చేసింది. కేసీఆర్ రైతులను నమ్మించి మోసం చేశాడు. జీహెచ్ఎంసీలో బీజేపీని గెలిపిస్తే వరద సహాయం కింద 25 వేలు ఇస్తాం. తెలంగాణలో ఆరోగ్యశ్రీ అమలుకావడంలేదు. మేం ఆ పథకాన్ని అమలు చేస్తాం. ఆవాజ్ యోజన పథకం ద్వారా బీజేపీ దేశంలో 2 లక్షల 5 వేల ఇళ్లు కట్టించింది. మూసీలో వరద నీటి వల్ల బోటింగ్ నడుస్తుంది. టికెట్స్ బుక్ చేసుకోండి. యువతకు ప్రభుత్వం నిరుద్యోగ భృతి ఇవ్వడంలేదు. కేసీఆర్ తీసుకుంటున్న కమీషన్లన్నీ ఫామ్‌హౌస్‌కు పోతున్నాయి’ అని ఆయన అన్నారు.
For More News..