జగిత్యాల టౌన్, వెలుగు: ఈనెల 18న జగిత్యాల పట్టణంలో నిర్వహించనున్న ప్రధాని మోదీ విజయ సంకల్ప సభను సక్సెస్ చేయాలని నిజామాబాద్ ఎంపీ అర్వింద్ శ్రేణులు, ప్రజలకు పిలుపునిచ్చారు. శుక్రవారం సభాస్థలిని స్థానిక బీజేపీ నేతలతో కలిసి ఎంపీ పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ నిజామాబాద్‌కు పసుపు బోర్డు ఇచ్చిన బీజేపీకి.. మూతపడిన షుగర్ ఫ్యాక్టరీలు తెరిపించడం పెద్ద కష్టమేమీ కాదన్నారు.
షుగర్ ఫ్యాక్టరీ రీఓపెన్ విషయంలో కాంగ్రెస్ లీడర్లు కమిటీలకే పరిమితమయ్యారన్నారు. దీనికి సంబంధించి జీవన్ రెడ్డి ఇప్పటికే మూడుసార్లు కమిటీ మెంబర్ గా వ్యవహరించారని గుర్తు చేశారు. కాంగ్రెస్ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం హిందువులను విస్మరించిందన్నారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్ లలోని మైనారిటీలు తిరిగి వస్తే భారతదేశ పౌరసత్వం ఇవ్వాలని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిందని గుర్తుచేశారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు పి.సత్యనారాయణరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు భోగ శ్రావణి, లీడర్లు పాల్గొన్నారు.