
నిజామాబాద్, వెలుగు : నవోదయ పాఠశాల ఏర్పాటుకు బోధన్ పట్టణ శివారులోని నిజాంషుగర్కు సంబంధించిన ప్రైవేటు స్థలాన్ని ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి ఎలా ప్రతిపాదిస్తారని ఎంపీ అర్వింద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం బీజేపీ జిల్లా కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. పార్లమెంట్ సెగ్మెంట్‌కు కోరుట్ల, జక్రాన్‌పల్లి మండలం కలిగోట్‌లో ఏర్పాటు చేసేందుకు రెండు నవోదయ స్కూళ్లను మంజూరు చేయించానన్నారు.తమ పార్టీ ఎమ్మెల్యే పైడి రాకేశ్‌రెడ్డి తన సెగ్మెంట్లో పెట్టాలని ఒత్తిడి చేసినా ప్రజల సౌకర్యం దృష్ట్యా నిర్ణయం మార్చుకోలేదన్నారు. ఒక్కో చోట రూ.వంద కోట్లతో నిర్మించే నవోదయ ఏర్పాటు విషయంలో అందరు ఎమ్మెల్యేలతో మాట్లాడానన్నారు.
కలెక్టర్‌గా పనిచేసిన అనుభవంతో ఇక్కడి భౌగోళిక పరిస్థితులపై అవగాహన ఉన్న స్టేట్ ఎడ్యుకేషన్ సెక్రటరీ డాక్టర్ యోగితా రాణా తాను ప్రతిపాదించిన కలిగోల్ గ్రామాన్ని నవోదయకు ఓకే చేశారన్నారు. లిక్కర్ బిజినెస్ చేసే సుదర్శన్‌రెడ్డి సొంత ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు ఆసక్తితో ఉన్నారని ఎంపీ ఆరోపించారు. కలిగోట్ నుంచి నవోదయ వెళ్తుంటే రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి ఎందుకు సైలెంట్ అవుతున్నారని ప్రశ్నించారు.
జక్రాన్‌పల్లిలో ఎయిర్ పోర్టు నిర్మాణం ముందుకు పడాలంటే స్టేట్ గవర్నమెంట్ సర్వే రిపోర్టు అవసరమని తెలిసి కూడా భూపతిరెడ్డి కదలడంలేదన్నరు. రెండు ఎమ్మెల్సీలు ఓడినా కాంగ్రెస్‌కు బుద్ధి రావడంలేదన్నారు. నిజామాబాద్ జిల్లా నుంచి 85 శాతం ఓట్లు బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థులకు పడ్డాయన్నారు. నగర పాలక ఎలక్షన్ ఎప్పుడు జరిగినా పోటీ మజ్లిస్, బీజేపీ మధ్యే ఉంటుందన్నారు.
ఆదివారం ఎంపీలతో మీటింగ్ ఏర్పాటు చేసిన ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క ఒక రోజు గడువుతో సమాచారం పంపి రమ్మనడం విచిత్రంగా ఉందన్నారు. జనాభా ప్రతిపాదికన నియోజకవర్గాలను పునర్విభజిస్తే తప్పేముందన్నారు. సమావేశంలో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్‌రెడ్డి, బీజేపీ జిల్లా ప్రెసిడెంట్ దినేశ్, స్రవంతిరెడ్డి తదితరులు ఉన్నారు.