చంద్రబాబు ఏ విధంగా వక్ఫ్ చట్టానికి మద్దతు ఇస్తుండు..? ఎంపీ ఓవైసీ

చంద్రబాబు ఏ విధంగా వక్ఫ్ చట్టానికి మద్దతు ఇస్తుండు..? ఎంపీ ఓవైసీ

హైదరాబాద్: తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో కేవలం హిందువులను మాత్రమే ఉద్యోగులుగా కొనసాగిస్తోన్న ఏపీ సీఎం చంద్రబాబు.. వక్ఫ్ బోర్డులో ఇతర మతస్తులను సభ్యులుగా చేర్చే వక్ఫ్ బిల్లు ఏ విధంగా మద్దతు ఇస్తున్నారని హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ ప్రశ్నించారు. దారుసలామ్‎లోని ఎంఐఎం పార్టీ కార్యాలయంలో వక్ఫ్‌ బిల్లుకు వ్యతిరేకంగా హైదరాబాద్‌లో ఈ 19న ఆలిండియా ముస్లిం పర్సనల్‌ లా బోర్డు ఆధ్వర్యంలో జరగనున్న బహిరంగ సభ ఏర్పాట్ల గురించి చర్చించారు. 

ఈ సందర్భంగా అసదుద్దీన్ మాట్లాడుతూ.. వక్ఫ్‌ చట్టానికి వ్యతిరేకంగా ఈ నెల (ఏప్రిల్) 19న ముస్లింలతో హైదరాబాద్‎లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని తెలిపారు. ఆలిండియా ముస్లిం పర్సనల్‌ లా బోర్డు ఆధ్వర్యంలో ఈ సభ జరుగుతుందన్నారు. దేశవ్యాప్తంగా మత పెద్దలు, పలువురు రాజకీయ నేతలు ఈ సభకు హాజరు కానున్నారని.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‎తో పాటు దేశ వ్యాప్తంగా ఉన్న ముస్లిం నాయకులు పాల్గొంటారని చెప్పారు. 

కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వక్ఫ్ బిల్లును రాజ్యాంగ వ్యతిరేకంగా తీసుకొస్తుందని.. ఆర్టికల్ 23, 26లను అడ్డు పెట్టుకొని వక్ఫ్ భూములు దోచుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. ముస్లింలకు అన్యాయం చేసేందుకు బీజేపీ అనుబంధ పార్టీల నాయకులు చంద్రబాబు, నితీష్ కుమార్, జయంత్ చౌదరి తదితరులు మద్దతుతో వక్ఫ్ బిల్లును రూపొందించిందని మండిపడ్డారు. హిందూ ధర్మం, జైన ధర్మం, సిక్ ధర్మం బోర్డులో వారికీ సంబంధించిన వారు మాత్రమే సభ్యులుగా ఉంటారు.. కానీ వక్ఫ్ బోర్డులో ముస్లిమేతరుడిని ఎలా నియమిస్తారని ప్రశ్నించారు.

 వక్ఫ్ బిల్లు ప్రకారం వక్ఫ్ భూములను అక్రమంచిన వారికి కట్టబెట్టే ప్రయత్నం చేస్తుందని.. సెక్షన్ 3D, ASMR యాక్ట్ ప్రకారం ముస్లింలకు తీరని అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. వక్ఫ్‌ అంటేనే నా దృష్టిలో ఓ ప్రార్థనా స్థలమన్నారు. ముస్లింలకు వ్యతిరేకంగా మోదీ సర్కార్‌ పని చేస్తోందని.. వక్ఫ్‌పై బీజేపీ చెప్పేవన్నీ అబద్ధాలే-నని విమర్శించారు. వక్ఫ్‌ బిల్లుతో ముస్లింలకు తీవ్ర నష్టమని.. ఈ బిల్లుపై మోడీ మరోసారి ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు.