దాడుల సంస్కృతి బీఆర్ఎస్దే: కాంగ్రెస్ ఎస్టీ ఎమ్మెల్యేలు

దాడుల సంస్కృతి బీఆర్ఎస్దే: కాంగ్రెస్ ఎస్టీ ఎమ్మెల్యేలు
  • లగచర్ల రైతులపై సర్కారు అరాచకంగా వ్యవహరిస్తున్నట్టు తప్పుడు ప్రచారం
  • అధికారులపైకి అమాయక ప్రజలను ఉసిగొల్పిన్రు
  • జాతీయ ఎస్టీ కమిషన్మెంబర్​కు ఎంపీ బలరాం నాయక్,ఎస్టీ ఎమ్మెల్యేల వివరణ

హైదరాబాద్, వెలుగు:అధికారులపై దాడులు చేసే సంస్కృతి బీఆర్ఎస్​దేనని ఎంపీ బాలరాం నాయక్ అన్నారు. లగచర్లలో  రైతులపై ప్రభుత్వం అరాచకంగా వ్యవహరిస్తున్నట్టు బీఆర్ఎస్ చిత్రీకరిస్తోందని దుయ్యబట్టారు. సోమవారం ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్యేలు రామచంద్రు నాయక్, బాలు నాయక్, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్​ జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోతు హుస్సేన్ నాయక్​ను కలిసి లగచర్ల ఘటన జరిగిన తీరు, అక్కడి పరిస్థితిని ఆయనకు వివరించారు. 

అనంతరం గాంధీ భవన్​లో వారు మీడియాతో మాట్లాడారు. ఖమ్మంలో గిరిజన రైతులకు బేడీలు వేసిన విషయం కేసీఆర్ మర్చిపోయారా? అని ఎంపీ బాలరాం నాయక్ ప్రశ్నించారు. భూసేకరణను అడ్డుకున్న యువకుడికి ఉద్యోగం రాకుండా చేసింది బీఆర్ఎస్ కాదా? అని నిలదీశారు. బీఆర్ఎస్ అరాచకాల గురించి మాట్లాడితే రోజంతా సరిపోదన్నారు. లగచర్ల ఘటనపై కేసీఆర్ ఎందుకు స్పందించడంలేదని ఆయన ప్రశ్నించారు. గిరిజనులను బలి పశవులను చేయాలని బీఆర్ ఎస్ నేతలు చూస్తున్నారని మండిపడ్డారు.

కేటీఆర్, పట్నం నరేందర్ రెడ్డి ఉసిగొల్పితేనే గిరిజనులు అధికారులపై దాడి చేశారని ప్రభుత్వ విప్ రామచంద్రు నాయక్ ఆరోపించారు. బీఆర్ఎస్ నాయకులను చెప్పులతో కొట్టే రోజులు వస్తాయన్నారు. అభివృద్ధిని అడ్డుకోవాలని బీఆర్ఎస్ నాయకులు లంబాడాలను రెచ్చగొడుతున్నారని దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ మండిపడ్డారు. కేసీఆర్ లంబాడా జాతికి తీవ్ర అన్యాయం చేశారని మండిపడ్డారు.

 సీఎం రేవంత్​రెడ్డిని చూస్తే కేసీఆర్, కేటీఆర్ వణికిపోతున్నారని.. కాంగ్రెస్ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేసి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ అన్నారు. సీఎం నియోజకవర్గంలో గొడవ చేస్తే హైలెట్ కావొచ్చని కేటీఆర్, నరేందర్ రెడ్డి లగచర్ల లో అధికారులపైకి అమాయక ప్రజలను ఉసిగొల్పారని ఆరోపించారు.   

కేటీఆర్ నియోజకవర్గంలో ఎస్సీలపై జరిగిన దాడి నివేదిక ఏమైంది?: విప్ ఆది శ్రీనివాస్

బీఆర్ఎస్​ నేత కేటీఆర్ నియోజకవర్గంలోని నేరెళ్లలో దళితులపై జరిగిన దాడి మీద జాతీయ ఎస్సీ కమిషన్ విచారణ జరిపినా.. ఆ  నివేదిక ఇప్పటి వరకు ఎందుకు బయటకు రాలేదని విప్ ఆది శ్రీనివాస్ ప్రశ్నించారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అని చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలన్నారు.

 సోమవారం హైదరాబాద్​లో ఆయన మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. లగచర్ల ఘటనపై జాతీయ ఎస్టీ కమిషన్​కు ఫిర్యాదు చేస్తామని కేటీఆర్ ఢిల్లీ వెళ్లడాన్ని ఆయన తప్పుబట్టారు. ఈ ప్రేమ నేరెళ్ల ఘటనలో ఏమైందని ఫైర్ అయ్యారు. నేరెళ్ల బాధితులకు ఎందుకు న్యాయం చేయలేదో బీజేపీ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.