- మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్, జాతీయ ఎస్టీ కమిషన్ మెంబర్ హుస్సేన్ నాయక్, ట్రైకార్ చైర్మన్ బెల్లయ్య నాయక్
- ములుగులోని జాతీయ గిరిజన వర్సిటీలో ఘనంగా బిర్సా ముండా వేడుకలు
ములుగు, వెలుగు : ఆదివాసీల ఆరాధ్యుడు బిర్సా ముండా అని, గిరిజనుల సంక్షేమం, దేశ స్వాతంత్రం కోసం పోరాడిన మహనీయుడని మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్, జాతీయ ఎస్టీ కమిషన్ మెంబర్ జాటోత్ హుస్సేన్ నాయక్, ట్రైకార్ చైర్మన్ బెల్లయ్య నాయక్ కొనియాడారు. శుక్రవారం ములుగు మండలం జాకారం వైటీసీ సెంటర్ లోని జాతీయ గిరిజన వర్సిటీలో జన్ జాతీయ గౌరవ్ దివస్ , బిర్సా ముండా 150వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా బిర్సా ముండా ఫొటోకు పూలమాలవేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బిర్సా ముండా భూమి, నీటి కోసం పోరాటం చేయడమే కాకుండా భూమి శిస్తును వ్యతిరేకిస్తూ గిరిజన జాతిని ఏకం చేశాడని, వారి అభివృద్ధి కోసం నిరంతరం ఉద్యమించాడని పేర్కొన్నారు. గిరిజనుల అభివృద్ధికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం రూ.360 కోట్లు కేటాయించిందన్నారు. ములుగులోని సెంట్రల్ ట్రైబల్ వర్సిటీలో గిరిజనులకు 80 శాతం సీట్లు కేటాయించాలని ఎంపీ బలరాం నాయక్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. గిరిజనుల సంక్షేమ కోసం రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
ములుగు జిల్లా కేంద్రంలోని సమ్మక్క సారలమ్మ గిరిజన వర్సిటీలో రాష్ట్రస్థాయి సదస్సులు నిర్వహించుకోవడం సంతోషంగా ఉందన్నారు. జిల్లాలోని ఉత్తమ పెసా పంచాయతీలుగా ఎన్నికైన అకినపల్లి మల్లారం, పసర, రాయినిగూడెంకు అవార్డులు అందజేశారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కార్యక్రమంలో కలెక్టర్దివాకర టీఎస్, ఐటీడీఏ పీవో చిత్రమిశ్రా, రాష్ట్ర ఎస్టీ వెల్ఫేర్ సొసైటీ సెక్రటరీ శరత్, అదనపు కార్యదర్శి జ్ఞానేశ్ భారతి, డీఎఫ్ఓ రాహుల్ కిషన్ జాదవ్, డైరెక్టర్ భాస్కర్, ట్రైబల్ వెల్ఫేర్ శాఖ అడిషనల్ డైరెక్టర్ సర్వేశ్వర రెడ్డి, గ్రంథాలయ చైర్మన్ బానోతు రవి చందర్, అడిషనల్ కలెక్టర్ మహేందర్, జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు, ఆదివాసీ సంఘాల నేతలు పాల్గొన్నారు.