సివిల్ సప్లయ్స్​లో భారీ స్కాం.. కాళేశ్వరం తర్వాత పెద్ద కుంభకోణం ఇదే: బండి సంజయ్

  •     దీనిపై మంత్రి ఉత్తమ్ విచారణ చేపట్టాలె
  •     లేదంటే ఆయన కూడా మిల్లర్లతో లాలూచీ పడ్డట్టేనని కామెంట్స్   

నల్గొండ, వెలుగు:  రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టు తర్వాత సివిల్‌‌‌‌సప్లయ్స్ శాఖలో అతిపెద్ద స్కామ్‌‌‌‌ జరిగిందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్‌‌‌‌ ఆరోపించారు. శనివారం నల్గొండలోని బీజేపీ ఆఫీసులో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతుల దగ్గర పంట కొని ఎఫ్‌‌‌‌సీఐకి విక్రయిస్తూ మధ్యవర్తిగా ఉన్న సివిల్‌‌‌‌సప్లయ్స్ శాఖకు రూ.50 వేల కోట్ల అప్పులు పేరుకుపోవడమే కాకుండా రూ.10 వేల కోట్ల నష్టం ఎందుకు వస్తోందని ప్రశ్నించారు. 

కొంత మంది రైస్‌‌‌‌ మిల్లర్లు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ నేతలతో లాలూచీ పడి అవినీతికి పాల్పడుతున్నారని విమర్శించారు. గతంలో రూ.వేల కోట్లు కేసీఆర్‌‌‌‌ కుటుంబానికి ముట్టాయని.. ఇప్పుడు కాంగ్రెస్‌‌‌‌ వాళ్లు రూ.వేల కోట్లు ఢిల్లీకి పంపుతున్నారని సంజయ్ ఆరోపించారు. కాంగ్రెస్‌‌‌‌ ప్రభుత్వానికి దమ్ముంటే సివిల్‌‌‌‌సప్లయ్స్ శాఖలో జరిగిన అవినీతిపై సిట్టింగ్‌‌‌‌జడ్జితో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్‌‌‌‌ చేశారు. మంత్రి ఉత్తమ్‌‌‌‌ కుమార్‌‌‌‌రెడ్డి దీనిపై విచారణ జరిపిస్తారనే నమ్మకం ఉందన్నారు. విచారణ చేయకుంటే ఆయన కూడా మిల్లర్లతో లాలూచీ పడ్డట్లే అని స్పష్టం చేశారు. 

గత సీఎం కేసీఆర్‌‌‌‌ కృష్ణా జలాల విషయంలో అప్పటి ఏపీ సీఎం చంద్రబాబుతో కుమ్మక్కై నల్గొండ జిల్లాకు తీవ్ర అన్యాయం చేశారని సంజయ్ ఆరోపించారు. తెలంగాణకు 575 టీఎంసీలు రావాల్సి ఉండగా.. 299 టీఎంసీలకే కేసీఆర్‌‌‌‌ సంతకం పెట్టారన్నారు. కాంగ్రెస్‌‌‌‌ ప్రభుత్వాన్ని పడగొట్టే దురాలోచన బీజేపీకి లేదని, కాంగ్రెస్‌‌‌‌ వాళ్లు ప్రభుత్వాన్ని పడగొట్టే అవకాశం ఇతరులకు ఇవ్వరని ఎద్దేవా చేశారు. మతపరమైన రిజర్వేషన్లు అడ్డుకోవాలంటే బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రేమేందర్‌‌‌‌రెడ్డిని గెలిపించాలని కోరారు. సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్‌‌‌‌రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు గొంగిడి మనోహర్‌‌‌‌రెడ్డి, పార్టీ నేతలు ప్రకాష్‌‌‌‌రెడ్డి, రచనారెడ్డి తదితరులు పాల్గొన్నారు.