బోయినిపల్లి( ఇల్లంతకుంట), వెలుగు: కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 100 రోజులైందని, ఆ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీల హామీలెమయ్యాయని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ప్రశ్నించారు. శుక్రవారం రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని పలు గ్రామాల్లో ప్రజాహిత పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్నికల హామీల పేరుతో కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసిందన్నారు.
100 రోజుల్లోనే ఆరుగ్యారంటీలను అమలు చేస్తామని చెప్పి, ఇప్పటికి మహిళలకు రూ.2500, రైతుభరోసా రూ.15వేలు,వ్యవసాయకూలీలకు రూ.12వేలు ఇవ్వలేదన్నారు. పెద్దలింగాపురం చెరువు నిండుతుంది కానీ నీళ్లు ఎటుపోతున్నాయో అర్థం కావట్లేదన్నారు. మోదీ ప్రభుత్వం వచ్చాకే పంటలకు మద్దతుధర పెరిగిందన్నారు. బీఆర్ఎస్ హయాంలో సమస్యలపై పోరాడింది తామైతే కాంగ్రెస్ పార్టీకి ఓటేయడం న్యాయమా అంటూ ప్రజలను అడిగారు. కరీంనగర్ జిల్లా గన్నేరువరంలో మండలం గుండ్లపల్లిలో పర్యటించారు.