- ఆరు గ్యారంటీలకు పైసలు ఎక్కడి నుంచి తెస్తరు?
- అర్హులందరికీ ఇస్తామని చెప్పి ఇప్పుడు కండీషన్లు పెడుతున్నరు
- బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్
హుజూరాబాద్ వెలుగు : వంద రోజుల్లో ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని ఓట్లు దండుకున్న కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక వాటికి కోతలు పెడుతూ ప్రజలను మోసగిస్తోందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ మండిపడ్డారు. ప్రజాహిత యాత్రలో భాగంగా ఆదివారం హుజూరాబాద్ లో పాదయాత్ర కొనసాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గానికి 3,500 ఇండ్లు ఇస్తామనడం ఎంతవరకు సమంజసమన్నారు. తెలంగాణలో ఉద్యోగులకు జీతాలివ్వలేని పరిస్థితి ఉందని, అలాంటి సందర్భంలో అప్పుల్లో ఉన్న తెలంగాణలో ఆరు గ్యారంటీలను అమలు చేయాలంటే రూ.5 లక్షలు కోట్లు అవసరమవుతాయన్నారు. వాటిని ఎక్కడి నుంచి తెస్తారో చెప్పాలన్నారు.
ఎన్నికలకు ముందు ఎలాంటి కండీషన్లు లేకుండా అర్హులైన వారందరికీ ఆరు గ్యారంటీలను వంద రోజుల్లోనే అమలు చేస్తామని ప్రకటించిందని, ఇప్పుడు కొత్తగా నిబంధనలు పెడుతోందన్నారు. రాష్ట్రంలో 90 లక్షల తెల్ల రేషన్ కార్డులుంటే..40 లక్షల మందికి మాత్రమే 5 వందలకే గ్యాస్ సిలిండర్, 2 వందల యూనిట్లు ఉచిత కరెంట్ అమలు చేస్తున్నారన్నారు. మిగిలిన 50 లక్షల మంది సంగతి ఏమిటని ప్రశ్నించారు. రాష్ట్రంలో అర్హులైన 10 లక్షల మందికి కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదన్నారు. ఇండ్ల కోసం లక్షల మంది దరఖాస్తులు పెట్టుకుంటే నియోజకవర్గానికి 3వేల 500 మందికే ఇండ్లిస్తామంటే మిగిలిన వాళ్ల పరిస్థితి ఏమిటన్నారు.
కరీంనగర్ అభివృద్ధికి రూ.12 వేల కోట్ల నిధులు తెచ్చానని, జాతీయ ప్రధాన కార్యదర్శిని అయ్యానని, తొలి జాబితాలోనే తనకు ఎంపీ సీటు వచ్చిందన్నారు. కరీంనగర్ లో కాంగ్రెస్, బీఆర్ఎస్ తనకు పోటీయే కాదన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి , పట్టణ అధ్యక్షుడు గంగిశెట్టి రాజు పాల్గొన్నారు.