హామీలు నెరవేర్చలేదని కేసీఆర్‌ ముక్కు నేలకు రాయాలి: బండి సంజయ్

మల్యాల/కొడిమ్యాల, వెలుగు : అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ను ఊడ్చిపడేసినప్పటికీ కేసీఆర్‌ కరీంనగర్‌లో కదనభేరి సభ నిర్వహిస్తున్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్‌ ఎద్దేవా చేశారు. జగిత్యాల జిల్లా మల్యాల, కొడిమ్యాల మండలాల్లో ఆదివారం నిర్వహించిన ప్రజాహిత యాత్రలో ఆయన మాట్లాడారు. ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని కేసీఆర్ కదనభేరి సభలో ముక్కునేలకు రాస్తేనే ప్రజలు క్షమిస్తారన్నారు. తాను ఎన్నడూ పార్లమెంట్‌కే వెళ్లలేదని కేటీఆర్‌ అహంకారంతో మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్‌ ఎన్ని సార్లు అసెంబ్లీకి వెళ్లారో, బీఆర్‌ఎస్‌ ఎంపీలు ఎన్ని సార్లు పార్లమెంట్‌కు వెళ్లారో లెక్కలు బయటపెట్టాలన్నారు.

కేసీఆర్‌ కొడుకు కాకపోతే కేటీఆర్‌ను ఎవరూ పట్టించుకోరన్నారు. వినోద్‌కుమార్‌ కరీంనగర్‌కు ఏం తెచ్చాడో చెప్పాలని సవాల్‌ చేశారు. కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి ఉంటే ఎంపీ ఎన్నికల ముందే బడ్జెట్‌ను ప్రవేశపెట్టి, ఆరు గ్యారంటీలను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. దేశానికి మోదీ నాయకత్వం అవసరమని, అన్ని కులాలు, రాజకీయ పార్టీలు మోదీ కోసం ఏకం కావాలని పిలుపునిచ్చారు.

కాంగ్రెస్‌ మైనార్టీ డిక్లరేషన్‌ అంటే..బీఆర్‌ఎస్‌ ఎంఐఎంకు వత్తాసు పలుకుతదని, అలాంటప్పుడు బీజేపీ హిందుత్వం గురించి మాట్లాడితే తప్పేంటని ప్రశ్నించారు. కరీంనగర్‌లో రైల్వే గేట్‌ నిర్మాణానికి కేంద్రం నుంచి రూ. 134 కోట్లు తీసుకువస్తే, తాను అందుబాటులో లేని టైంలో బీఆర్‌ఎస్‌ లీడర్లు కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించారన్నారు. మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ, పార్టీ జిల్లా అధ్యక్షుడు మోరపల్లి సత్యనారాయణ, ఇన్‌చార్జ్‌ రమేశ్‌, బింగి వేణు, నేరెళ్ల శ్రవణ్‌రెడ్డి, బొట్ల ప్రసాద్, వెంకటస్వామి యాదవ్, గాజుల మల్లేశం, రాములు పాల్గొన్నారు.