జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని టీఆర్ఎస్ నాయకులు చేస్తున్న డబ్బుల పంపిణీని అడ్డుకున్న మేడ్చల్ అర్బన్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు హరీష్ రెడ్డిపై పోలీసులు దాడిచేశారని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. పోలీసుల దాడిలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న హరీష్ రెడ్డిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ఆదివారం అర్దరాత్రి 12 గంటలకు పరామర్శించారు. రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి, ముఖ్యమంత్రి కేసీఆర్ డైరెక్షన్లో టీఆర్ఎస్ పార్టీకి కొమ్ము కాస్తున్నారని ఆయన అన్నారు.
‘మేడ్చల్ జిల్లాలో టీఆర్ఎస్ నాయకులు డబ్బులు పంచడాన్ని చూసి బీజేపీ కార్యకర్తలు అడ్డుకొని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు మాత్రం టీఆర్ఎస్ నాయకులను కాకుండా.. బీజేపీ కార్యకర్తలను అరెస్ట్ చేశారు. దాంతో జిల్లా అధ్యక్షుడు పన్నాల హరీష్ రెడ్డి పోలీసులను నిలదీశాడు. దాంతో ఆయనను పెట్రోలింగ్ వాహనంలో ఎక్కించుకొని.. కొట్టుకుంటూ స్టేషన్‌కి తీసుకెళ్లారు. ఆ తర్వాత ఆయనను విడిచిపెట్టాలని కార్యకర్తలు పోలీస్ స్టేషన్ ముందు ధర్నాకు దిగారు. దాంతో ఆయనను విడిచిపెట్టారు. ప్రజాభిమానం కోల్పోయిన టీఆర్ఎస్ పార్టీ అడ్డదారిలో గెలవాలని చూస్తుంది. పోలీసు అధికారులే దగ్గరుండి డబ్బుల పంపిణీ చెయ్యడం సిగ్గుచేటు. దీన్ని బీజేపీ కార్యకర్తలు ఎక్కడికక్కడ అడ్డుకోవాలి. ఉన్నతస్థాయి నిఘా అధికారి టీఆర్ఎస్ పార్టీ గెలవాలని చట్టాల్ని తుంగలో తొక్కారు. అభివృద్దే గెలిపిస్తుందని మేకపోతు గాంభీర్యం ప్రదర్షించిన టీఆర్ఎస్ నాయకులు.. తీరా ఎన్నికలు దగ్గరపడేసరికి నోట్ల కట్టలతో బయలుదేరారు. పోలీసులను టీఆర్ఎస్ కార్యకర్తలుగా వాడుకుంటూ కేసీఆర్ ప్రభుత్వం రాజ్యాంగ విలువలను తుంగలో తొక్కుతుంది. ఎవరెన్ని కుట్రలు చేసినా బీజేపీ గెలుపును అడ్డుకోలేరు. టీఆర్ఎస్ నాయకులు రెడ్ హ్యాండెడ్‌గా డబ్బులు పంచుతూ పట్టుబడ్డా.. పోలీసులు కేసులు నమోదు చెయ్యకపోవడం దారుణం. డీజీపీ టీఆర్ఎస్ పార్టీ ఏజెంట్‌లా పనిచేస్తున్నారు. ఆయనను వెంటనే బదిలీ చేయాలి. డీజీపీ ఇలాగే ప్రవర్తిస్తే రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య వస్తుంది. ఆ గొడవల్లో డీజీపీ బలైపోతరు. ఆయన ఇంకా ఇలాగే ప్రవర్తిస్తే ఆయన చాంబర్‌లోకి చొచ్చుకుపోతాం. ఈ ఎన్నికల తర్వాత రజాకార్ల రాజ్యం పోయి.. రామ రాజ్యం రానుంది. బల్దియాపై బీజేపీ జెండా ఖచ్చితంగా ఎగురుతుంది’ అని ఆయన అన్నారు.
For More News..