చదువు పేరుతో విద్యార్థుల్లో వైషమ్యాలు సృష్టిస్తున్నారు

చదువు పేరుతో విద్యార్థుల్లో వైషమ్యాలు సృష్టిస్తున్నారు

విద్యార్థులకు విద్యాబుద్దులు నేర్పిస్తున్నామన్న సాకుతో స్వేరోస్ సంస్థ విద్యార్థుల్లో వైషమ్యాలు సృష్టిస్తోందని ఎంపీ బండి సంజయ్ అన్నారు. ఆ సంస్థకు ఇన్‌చార్జీగా ఉన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఒక మతానికి అనుకూలంగా, మరో మతాన్ని కించపరుస్తూ జరిగిన కార్యక్రమంలో పాల్గొనడం పట్ల ఆయన మండిపడ్డారు. ఇటువంటి కార్యక్రమాల ద్వారా విద్యార్థుల్లో హిందుత్వంపై వ్యతిరేకత పెరిగేలా చేస్తున్నారని బండి సంజయ్ అన్నారు.

‘సమాజంలో వైషమ్యాలు సృష్టిస్తున్న స్వేరోస్ సంస్థపై వెంటనే చర్య తీసుకోవాలి. సీఎం కేసీఆర్ ప్రోద్భలంతోనే హిందూ మనోభావాలను దెబ్బతీసే ఈ కుట్ర జరుగుతోంది. ఈ సంస్థకు నిధులెక్కడి నుంచి వస్తున్నాయి? మీరు లెక్కలు తీస్తారా? కేంద్రానికి ఫిర్యాదు చేసి అక్కడి నుంచి తీయించమంటారా? హిందువులను కించపరిచే కార్యక్రమాలు జరుగుతుంటే ఇంటెలిజెన్స్ ఏంచేస్తోంది? చాలా ఏళ్ల నుంచి ఈ కుట్ర జరుగుతోంది. హిందూ వ్యతిరేకులను ప్రోత్సహించడమే సీఎం కేసీఆర్ తన విధిగా చేసుకున్నారు. ప్రజల్లో వ్యతిరేకత వస్తున్నప్పటికీ సీఎం మౌనం వహించడం ఆయన పతనానికి నాంది కాబోతోంది. ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తాం’ అని ఎంపీ బండి సంజయ్ అన్నారు.