- దైవ కార్యాన్ని రాజకీయం చేయకండ
- ఎంపీ బండి సంజయ్
జమ్మికుంట, వెలుగు : ఈనెల 22న అయోధ్యలో జరగబోయే రామ మందిర పున:ప్రతిష్ఠ కార్యక్రమం కోసం యావత్ ప్రపంచమంతా ఎదురుచూస్తుందని, ఆరోజు రాష్ట్రంలో సెలవు ప్రకటించాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. శుక్రవారం కరీంనగర్జిల్లా ఇల్లందకుంటలోని సీతారామచంద్రస్వామి ఆలయాన్ని ఎంపీ సందర్శించారు. అర్చకులు పూర్ణకుంభంతో ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం గర్భగుడిలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దైవకార్యాన్ని రాజకీయం చేయొద్దని సూచించారు.
అయోధ్య అక్షింతలపై కాంగ్రెస్ నేతల విమర్శలపై ఎంపీ మాట్లాడుతూ ‘అక్షింతల్లో రేషన్ బియ్యం, బాసుమతి బియ్యం, జై శ్రీరాం బియ్యం అనే రకాలు ఉండవని, పవిత్రమైన దేవుడి అక్షింతలపై కామెంట్ చేయడం కాంగ్రెస్ నేతలకు తగదు. వారు కోరితే బాసుమతి బియ్యం పంపించేందుకు సిద్ధంగా ఉన్నాం’ అని పేర్కొన్నారు. అనంతరం చీపురు, పార పట్టి ఆలయ పరిసరాలను శుభ్రం చేశారు.
జమ్మికుంట పట్టణంలోని సరస్వతీ శిశు మందిర్ ను సందర్శించి విద్యార్థులతో ముచ్చడించారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు కృష్ణారెడ్డి, లీడర్లు సంపత్ రావు, జీడీ మల్లేశ్, రాజేందర్, తిరుపతి రెడ్డి, సురేందర్ రెడ్డి, తిరుపతయ్య పాల్గొన్నారు.
సైకిల్‌పై అయోధ్యకు..
కరీంనగర్ సిటీ, వెలుగు : అయోధ్యలో రాముడి విగ్రహ ప్రతిష్ఠ నేపథ్యంలో కరీంనగర్ సుభాష్ నగర్ కు చెందిన ఇద్దరు యువకులు మంగ వంశీ కృష్ణ, ఆదిత్య శుక్రవారం కరీంనగర్ నుంచి సైకిళ్లపై బయలుదేరారు. ఈ యాత్రను ఎంపీ బండి సంజయ్ ప్రారంభించారు.