- కార్పొరేషన్‌కు ఎప్పటికప్పుడు నిధులిప్పించారు
- జిల్లాతో సంబంధం లేని మంత్రి పొన్నం సమీక్ష ఎలా నిర్వహిస్తారు
- కరీంనగర్ మేయర్ సునీల్ రావు
కరీంనగర్ టౌన్, వెలుగు: ఎంపీగా బండి సంజయ్ ఐదేండ్లలో కరీంనగర్ నగరపాలక సంస్థకు ఇచ్చిన సహకారం మరువలేనిదని కరీంనగర్ మేయర్ యాదగిరి సునీల్ రావు ప్రశంసించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు నిధులు మంజూరు చేయించారని గుర్తు చేశారు. ఆయన సహకరించకపోతే స్మార్ట్ సిటీ పనులు పూర్తయ్యేవి కాదన్నారు. కరీంనగర్ లోని ఓ ఫంక్షన్ హాల్ లో బుధవారం బీఆర్ఎస్ కార్పొరేటర్లతో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో మేయర్ మాట్లాడుతూ
కరీంనగర్‌తో ఎలాంటి సంబంధం లేని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి కరీంనగర్ కలెక్టరేట్ లో మున్సిపల్ కార్పొరేషన్‌పై సమీక్ష నిర్వహించడం ఏమిటని ప్రశ్నించారు. ఎమ్మెల్యే గంగులకు, తనకు, కార్పొరేటర్లకు సమాచారం ఇవ్వకుండా మున్సిపల్ అధికారులతో సమీక్ష సమావేశం ఎలా నిర్వహిస్తారన్నారు. కరీంనగర్‌కు ఇన్చార్జి మంత్రి పొన్నమా, ఉత్తమ్ కుమార్ రెడ్డా అని ప్రశ్నించారు. తనను ఓడగొట్టారనే కోపంతో కరీంనగర్ ప్రజలపై పొన్నం కసి మీద ఉన్నారని విమర్శించారు.
మానేరు రివర్ ఫ్రంట్‌లో అవినీతి జరిగితే మళ్లీ ప్రభుత్వం రెండో ఫేజ్ కు ఎలా సాంక్షన్ ఇచ్చిందని ప్రశ్నించారు. తాము ఏ విచారణకైనా సిద్ధమని, ఫ్లై యాష్ ఆరోపణలపైన కూడా విచారణకు సిద్ధం కావాలని మంత్రి పొన్నం ప్రభాకర్‌కు సవాల్ విసిరారు. బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ ఆమోదం లేకుండా స్మార్ట్ సిటీలో ఏ ఒక్క పని చేపట్టలేదని గుర్తు చేశారు. కలెక్టరేట్ లో మీటింగ్ పెట్టి, తమకు సమాచారం ఇవ్వకపోవడం కరీంనగర్ ప్రజలను అవమానపరిచినట్లేనని ఆవేదన వ్యక్తం చేశారు.
అనంతరం స్థానిక 54వ డివిజన్ కశ్మీర్ గడ్డ రైతుబజార్ లో రూ.10 కోట్లతో నిర్మించే ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణ పనులను ప్రారంభించారు. సోమవారం ఎల్ఎండీలో ప్రమాదవశాత్తు నీటిలో పడ్డ ఇద్దరు చిన్నారులను రక్షించిన జాలరి కొత్తూరు శంకర్‌ను మేయర్ అభినందించారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు గందె మాధవి, కోల మాలతి, వాల రమణారావు, దిండిగాల మహేశ్,కచ్చురవి, ఐలేందర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.