కరీంనగర్, వెలుగు: భారతదేశాన్ని విభజించాలంటూ కాంగ్రెస్ ఎంపీ డీకే సురేశ్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. కాంగ్రెస్ నేతలకు, టెర్రరిస్టులకు తేడా ఏముందని ప్రశ్నించారు. కరీంనగర్ లో శనివారం మీడియాతో మాట్లాడుతూ ‘కాశ్మీర్‌ను ప్రత్యేక దేశం కావాలని టెర్రరిస్టులు, పంజాబ్‌ను ఖలిస్తాన్ దేశంగా ప్రకటించాలని ఉగ్రవాదులు అడుగున్నారు.. ఇవ్వాళ కాంగ్రెస్ ఎంపీ సురేశ్..భారత్‌ను దక్షిణ దేశంగా, ఉత్తర దేశంగా విభజించాలంటున్నడు. మరి వాళ్లకు, వీళ్లకు తేడా ఏమిటి?’ అని ప్రశ్నించారు.
భారత్‌కు వ్యతిరేకంగా మాట్లాడే నేతలపై దేశ ద్రోహ కేసు పెట్టాలని కోరారు. ఇండియా కూటమి చీలికలు పీలికలైందని.. బీహార్ సీఎం నితీశ్‌కుమార్ ఆ కూటమి నుంచి బయటకు రావడంతో పాటు, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కాంగ్రెస్‌పై చేసిన విమర్శలే ఇందుకు నిదర్శనమన్నారు. అద్వానీకి భారతరత్న పురస్కారం ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేసిన బండి సంజయ్ బీజేపీ కార్యకర్తగా ఉన్నందుకు గర్వపడుతున్నామని, తమకు దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తున్నామని చెప్పారు. అయోధ్యలో రామాలయాన్ని నిర్మించింది తామేనని, ఏం చేసుకుంటారో చేస్కోండన్నారు.