- రేపు పార్లమెంట్ నియోజకవర్గ నేతల విస్తృత స్థాయి సమావేశం
- దిశానిర్దేశం చేయనున్న సంజయ్
- నెలాఖరులో 20 వేల మంది కార్యకర్తలతో ఆత్మీయ సమ్మేళనం
కరీంనగర్, వెలుగు: అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ.. ఎంపీ బండి సంజయ్ కుమార్ మరో నాలుగైదు నెలల్లో జరగబోయే పార్లమెంట్ ఎన్నికలపై దృష్టి సారించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనకు ఓటు షేర్ భారీగా పెరిగింది. దీంతో వచ్చే ఎన్నికల్లో కరీంనగర్ పార్లమెంట్ నుంచి మరోసారి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈక్రమంలో పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లపై ఫోకస్ పెట్టారు.
ఇందులో భాగంగా శనివారం ఉదయం 11 గంటలకు సిటీలోని ఈఎన్ గార్డెన్స్ లో పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్ల నాయకులతో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించనున్నారు. పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని 5 జిల్లాల అధ్యక్షులు, ఆఫీస్ బేరర్స్ తోపాటు 40 మండలాల పరిధిలోని మండలాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు మొదలు జిల్లా, రాష్ట్రస్థాయి ఆఫీస్ బేరర్లు ఈ సమావేశానికి హాజరుకానున్నారు.
సమావేశంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల సరళిపై చర్చించడంతోపాటు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ గెలుపు కోసం ప్రణాళిక రూపొందించనున్నట్లు తెలిసింది. బీజేపీకి ఆశించిన స్థాయిలో ఫలితాలు రాకపోవడంతో కార్యకర్తల్లో స్తబ్ధత నెలకొంది. ఈక్రమంలో వారిని యాక్టివేట్ చేయడమే లక్ష్యంగా బండి సంజయ్ ఈ సమావేశం నిర్వహిస్తున్నారని సమాచారం.
నెలాఖరున సమావేశం!
ఈ నెలాఖరున కరీంనగర్ పార్లమెంట్ నియోకవర్గ పరిధిలోని దాదాపు 20 వేల మంది బీజేపీ కార్యకర్తలతో కరీంనగర్ లో ఆత్మీయ సమ్మేళం నిర్వహించేందుకు సంజయ్ సిద్ధమవుతున్నారు. పోలింగ్ బూత్ అధ్యక్షుల నుంచి పార్లమెంట్ పరిధిలోని ముఖ్య నేతలందరినీ ఆహ్వానించనున్నారు. పార్టీ కోసం నిరంతరం పనిచేస్తున్న కార్యకర్తలను గుర్తించి వారిని కూడా ఈ సమావేశానికి రావాలని కబురు పంపారు. మరో రెండు రోజుల్లో ఈ సమావేశం తేదీ, వేదికను ఖరారు చేయనున్నారు.